T20 World Cup 2024: భారత్-కెనడా మ్యాచ్ రద్దు నేపథ్యంలో ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Batting great Sunil Gavaskar was angry at ICC Over the way things have progressed
  • మైదానం మొత్తాన్ని కప్పి ఉంచడానికి కవర్లు కూడా లేని మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేసిన సన్నీ
  • స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూడాలకున్న అభిమానులకు నిరాశ ఎదురైందని వ్యాఖ్య
  • ఐసీసీపై విమర్శలు గుప్పించిన ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్
ఐసీసీ వరల్డ్ కప్ 2024పై వరుణుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో జరగాల్సిన మ్యాచ్‌లు అనూహ్యంగా రద్దు అయ్యాయి. వర్షం పడకపోయినప్పటికీ మైదానం చిత్తడిగా మారడంతో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే ఈ మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. మంగళవారం శ్రీలంక - నేపాల్ మ్యాచ్, శుక్రవారం అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్, ఆ తర్వాత శనివారం భారత్ -కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. దీంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధంగా కీలక మ్యాచ్‌లు రద్దవడం పట్ల బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఐసీసీపై విమర్శలు గుప్పించారు. ‘‘గ్రౌండ్ మొత్తాన్ని కప్పి ఉంచగలిగే కవర్స్ లేని మైదానాలకు ఆతిథ్యం అవకాశం ఇవ్వొద్దని ఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నారు. పిచ్‌ను కవర్ చేయలేరు. మైదానంలోని ఇతర భాగాలు కూడా తడిసిపోకుండా అడ్డుకోలేరు. స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూడాలని చాలా మంది వేచిచూశారు. కానీ అలా జరగలేదు’’ అని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ కూడా ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘గ్రౌండ్ మొత్తం కప్పి ఉంచడానికి అవసరమైన కవర్లు ఎందుకు లేవు. తడి అవుట్‌ఫీల్డ్‌ల కారణంగా మ్యాచ్‌లు ఇంకా రద్దు అవుతూనే ఉన్నాయి’’ అని మండిపడ్డాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మైఖేల్ వాన్ స్పందించాడు. కాగా అమెరికా - ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్ సూపర్-8 దశకు అర్హత కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పాక్ మాజీలు, అభిమానులు సైతం ఐసీసీపై మండిపడుతున్నారు. కనీసం మైదానం మొత్తాన్ని కప్పి ఉంచే కవర్లు లేని మైదానంలో మ్యాచ్‌లు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
T20 World Cup 2024
T20 World Cup
Cricket
ICC
India vs Canada

More Telugu News