AP Volunteers: బెదిరించి రాజీనామా చేయించారు.. క్షమించి మళ్లీ చేర్చుకోండి.. టీడీపీ ఎమ్మెల్యేలను కలిసి వలంటీర్ల వినతులు

AP Volunteers meets TDP MLAs and wanted to take them back to jobs
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా 1.08 లక్షల మంది వలంటీర్ల రాజీనామా
  • ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం
  • కాకినాడ నగర ఎమ్మెల్యేను కలిసి కన్నీటి పర్యంతం
  • తమను తిరిగి చేర్చుకోవాలంటూ వినతిపత్రం
  • నెల్లూరులో వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వలంటీర్లు తమను మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలను కలిసి విన్నవించుకుంటున్నారు. వైసీపీ నేతలు అప్పుడు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని, రాజీనామా చేయకుంటే అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని చెప్పి బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో  రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వారిని నమ్మి మోసపోయిన తమను క్షమించి మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేలు, అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. 

వినతులు ఇస్తున్న వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబును శుక్రవారం కలిసిన వలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు. తమను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పలువురు వలంటీర్లు నిన్న ఎంపీడీవోను కలిసి తమను తిరిగి చేర్చుకోవాలని వినతిప్రతం సమర్పించారు. విశాఖపట్టణం, ఏలూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వలంటీర్లు ఎన్నికల తర్వాత అధికారులు, ఎమ్మెల్యేలను కలుస్తూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.08 లక్షలమంది వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు.

వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు

ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ గత రాత్రి నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నాయకులపై వలంటీర్లు ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ 41వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్, స్థానిక వైసీపీ నాయకులు తమపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
AP Volunteers
Andhra Pradesh
Telugudesam

More Telugu News