Shaheen Afridi: ‘సిగ్గు లేదా?’.. పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీపై ఆగ్రహ జ్వాలలు

Pakistan Pacer Shaheen Afridi Slammed For Celebrating Personal Milestone After USA Loss In T20 World Cup
  • స్వదేశంలో మండిపడుతున్న క్రికెట్ ఫ్యాన్స్
  • అమెరికా, భారత్ చేతిలో ఓటములపై సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్
  • షాహీన్ అఫ్రిదీ ‘టిక్‌టాక్’ వీడియోపై మండిపాటు
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్, అమెరికా చేతుల్లో ఓడిపోయిన పాకిస్థాన్ ఆటగాళ్లపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీపై మండిపడుతున్నారు. అమెరికా-పాకిస్థాన్ మ్యాచ్‌ హైలెట్స్‌లో తన బ్యాటింగ్‌ను చూసి అఫ్రిదీ మురిసిపోతున్న టిక్‌టాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై పాక్ క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.

పాకిస్థాన్ ఓటమి పాలైన మ్యాచ్‌ను చూసి ఆనందపడుతున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా టిక్‌టాక్ వీడియోలో అఫ్రిదీ తన బ్యాటింగ్‌ను చూసుకొని సంతోషపడ్డాడు. వీడియోలో నవ్వుతూ కనిపించాడు. అఫ్రిదీ పక్కన ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను షూట్ చేశాడు. టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై పాక్ క్రికెట్ అభిమానులు రగిలిపోతున్నారు. ‘‘ఇది సిగ్గులేని ప్రవర్తన. అమెరికాపై మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయలేదు. ఓటమిలో నీదే ప్రధాన పాత్ర. అయినప్పటికీ మ్యాచ్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నావ్? దాని గురించి ‘టిక్‌టాక్’ కూడానా’’ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మరికొందరు అభిమానులు కూడా అఫ్రిదీని దూషించారు. సోషల్ మీడియాలోనే కాకుండా మాజీ క్రికెటర్లు సైతం పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కాగా అమెరికాపై మ్యాచ్‌లో పాక్ సంచలన రీతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఛేజింగ్ చేయగా అఫ్రిదీ 16 బంతుల్లో 23 పరుగులు బాదాడు. ఇందులో 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అఫ్రిదీ 33 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా అమెరికా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సూపర్ ఓవర్‌గా మారడంలో అఫ్రిదీ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లినప్పటికీ పాక్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Shaheen Afridi
Pakistan
USA
T20 World Cup 2024
Cricket

More Telugu News