Superbug: అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్ సహా ఇతర వ్యోమగాములు

A superbug lurks inside the city in space the International Space Station
  • ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే స్పేస్‌బగ్ గుర్తింపు
  • బహుళ ఔషధాల నిరోధక బ్యాక్టీరియా అంటున్న శాస్త్రవేత్తలు
  • శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వెల్లడి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) సూపర్‌ బగ్‌గా పిలిచే 'ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మూసి ఉండే వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, ఇది బహుళ ఔషధాలను నిరోధించ గలిగే శక్తిమంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో దీనిని 'సూపర్ బగ్' అని పిలుస్తుంటారని, శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కాగా ఈ ‘సూపర్ బగ్‌’తో ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఎనిమిది మంది సిబ్బంది చిక్కుల్లో పడ్డారు. కాగా సునీతా విలియమ్స్‌తో పాటు బారీ యూజీన్ వ్యోమగామి ఇద్దరూ జూన్ 6, 2024న అంతర్జాతీయ అంతరక్ష కేంద్రానికి చేరుకున్నారు. మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ఈ ‘స్పేస్ బగ్స్‘ గ్రహాంతరాలకు సంబంధించినవి కావని, వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

భారతీయుడి సారధ్యంలో పరిశోధనలు
కాగా అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. అంతరిక్ష యాత్రల సమయంలో విభిన్నమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటుంటారని పరిశోధకులు చెబుతున్నారు. సంప్రదాయ వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటారు కాబట్టి వ్యోమగాముల ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసే పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పరిశోధనలకు కాలిఫోర్నియాలోని పసాదేనా కేంద్రంగా పనిచేస్తున్న నాసా ‘జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ’కి చెందిన డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారధ్యంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. వెంకటేశ్వరన్ నాసాలో చేరడానికి ముందు చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో మెరైన్ మైక్రోబయాలజీ చదివారు. 2023లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా ‘కలామిల్లా పియర్సోని’ అనే కొత్త మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ బగ్‌ని ఆయన కనుగొన్నారు.
Superbug
Space bug
International Space Station
Sunita Williams
ISS

More Telugu News