Bangladesh vs South Africa: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా చారిత్రాత్మక విజయం

South Africa have registered a historic win against Bangladesh
  • చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన దక్షిణాఫ్రికా
  • 113 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా అవతరణ
  • 4 పరుగుల తేడాతో ఓడిపోయిన బంగ్లాదేశ్
వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 119 పరుగుల స్కోరును‌ డిఫెండ్ చేసుకోగా.. 24 గంటల్లోనే ఆ రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది. న్యూయార్క్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 113 పరుగుల స్వల్ప స్కోరును ఆ జట్టు కాపాడుకుంది. 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

చివరి బంతికి 6 పరుగులు అవసరమవగా క్రీజులో ఉన్న టస్కిన్ అహ్మద్ కేవలం 1 పరుగు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా శిబిరం సంబరాలు చేసుకుంది. 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా టీ20 వరల్డ్ కప్‌లలో అత్యల్ప స్కోరు‌ను కాపాడుకున్న జట్టుగా సౌతాఫ్రికా అవతరించింది. ఆ తర్వాత భారత్ (119 స్కోరు), న్యూజిలాండ్ (119) వరుస స్థానాల్లో నిలిచాయి.

టీ20 వరల్డ్ కప్‌లలో డిఫెండ్ చేసుకున్న అత్యుల్ప టార్గెట్స్..
1. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా - 114 పరుగులు (2024)
2. పాకిస్థాన్‌పై ఇండియా - 120 (2024)
3. న్యూజిలాండ్‌పై శ్రీలంక - 120 (2024)
4. వెస్టిండీస్‌పై ఆఫ్ఘనిస్థాన్ - 124 (2016)
5. ఇండియాపై న్యూజిలాండ్ - 127 (2016).
Bangladesh vs South Africa
T20 World Cup 2024
Cricket

More Telugu News