నీళ్లలో పడ్డ ఐఫోన్ కోసం కేరళ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు
- ఏడు గంటలు కష్టపడి వెతికి తెచ్చిన టీమ్
- రెస్క్యూ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన హోటల్
- ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే సరిపోయేదన్న నెటిజన్లు
కర్ణాటకకు చెందిన ఓ మహిళ కేరళలో పర్యటిస్తోంది. ఈ టూర్ లో భాగంగా అంటీలియా ఛాలెట్స్ అనే రిసార్ట్ లో బస చేసింది. సరదాగా సముద్ర తీరంలోని కొండ రాళ్లపై ఫొటోలు దిగుతుండగా ఫోన్ జారి నీళ్లలో పడిపోయింది. రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ కావడంతో చాలాసేపు వెతికి నిరాశతో హోటల్ కు చేరుకుంది. రిసార్ట్ మేనేజ్మెంట్ కు విషయం చెప్పడంతో.. రిసార్ట్ కు చెందిన స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. ఫోన్ కోసం తీరంలో గాలించడం మొదలుపెట్టింది. వారికి తోడు కేరళ పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా వచ్చి చేరారు.
అంతా కలిసి దాదాపు ఏడు గంటలకు పైగా కష్టపడ్డారు. ఎట్టకేలకు ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ను సదరు మహిళకు అప్పగిస్తూ ఈ స్టోరీనంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా హోటల్ మేనేజ్ మెంట్.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రెస్క్యూ సిబ్బందిని కొంతమంది మెచ్చుకోగా.. మరికొందరు మాత్రం విమర్శించారు. ఖరీదైనదే అయినప్పటికీ ఓ ఫోన్ కోసం అంతమంది, అన్నేసి గంటలపాటు గాలించడమేంటని అన్నారు. ఫైర్ సిబ్బంది తమ విలువైన సమయాన్ని ఓ ఫోన్ ను వెతికేందుకు ఉపయోగించడంపై విస్మయం వ్యక్తం చేశారు.