Chandrababu: రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Chandrababu Naidu Pay Tributes to Ramoji Rao
  • రామోజీరావు తెలుగు వెలుగు.. ఆయన మృతి తీరని లోటు అన్న టీడీపీ అధినేత‌
  • ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారంటూ కితాబు
  • రామోజీని తెలుగు ప్రజల ఆస్తిగా పేర్కొన్న చంద్ర‌బాబు
  • అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారంటూ వ్యాఖ్య‌
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌ గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. 

తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని చంద్రబాబు తెలిపారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. 

ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో ఆయ‌న‌ సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని కితాబునిచ్చారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రామోజీరావుతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందన్నారు. స‌మస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని చెప్పారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.
Chandrababu
Ramoji Rao
TDP
Andhra Pradesh
Telangana

More Telugu News