US Couple: సరస్సులో నుంచి బయటపడ్డ పెట్టె.. నిండా నోట్ల కట్టలే.. అమెరికన్ జంటకు పట్టిన అదృష్టం

US Couple Finds Rs 83 Lakh In Cash While Fishing And Cops Let Them Keep It
  • న్యూయార్క్ లేక్ లో మాగ్నెట్ ఫిషింగ్ చేసిన జంట
  • లక్ష డాలర్లతో (సుమారు రూ.83 లక్షలు) కూడిన పెట్టె లభ్యం 

  • పెట్టె యజమానిని గుర్తించే వీలు లేక ఆ జంటకే ఇచ్చేసిన పోలీసులు
నీళ్లలో పడిపోయిన విలువైన వస్తువుల వేటకు వెళ్లిన ఓ జంటను అదృష్ట దేవత కరుణించింది. రాత్రికి రాత్రే లక్షాధికారులను చేసింది. మాగ్నెట్ ఫిషింగ్ చేసిన ఆ జంటకు ఓ ఇనుప పెట్టె దొరికింది. అందులో వంద డాలర్ల నోట్లు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించగా.. వాటి యజమానిని గుర్తించే వివరాలేవీ లేకపోవడంతో పోలీసులు ఆ పెట్టెను వారికే తిరిగిచ్చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుందీ ఘటన. 

న్యూయార్క్ కు చెందిన జేమ్స్ కేన్, బార్బీ అగొస్తిని అనే జంటకు మాగ్నెట్ ఫిషింగ్ చేయడం సరదా.. పొరపాటునో, ప్రమాదవశాత్తునో నీటిలో పడిపోయిన విలువైన వస్తువులను వెలికి తీసేందుకు చేసే ప్రయత్నమే మాగ్నెట్ ఫిషింగ్. చేపల వేటలాగే ఇందులోనూ ఓ గేలానికి చివర బలమైన అయస్కాంతాన్ని కట్టి నీటి అడుగున గాలిస్తుంటారు. ఆ అయస్కాంతానికి అతుక్కున్న ఇనుప వస్తువులను వెలికి తీసుకుంటారు. ఈ ప్రయత్నంలో విలువైన వాచీలు, ఫోన్లు, ఇనుప పెట్టెలు నీటి అడుగు నుంచి బయటపడుతుంటాయి.

కేన్, అగొస్తిని జంట కరోనా కాలం నుంచి ఇలా మాగ్నెట్ ఫిషింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చిన్నా చితక వస్తువులు దొరకగా.. తాజాగా న్యూయార్క్ లేక్ లో ఓ ఇనుప పెట్టె ( విలువైన వస్తువులు దాచుకునే సేఫ్) దొరికింది. దానిని తెరిచి చూడగా.. నీటిలో తడిసి పాడైపోయిన స్థితిలో ఉన్న వంద డాలర్ల నోట్లు ఉన్నాయి. వాటి విలువ లక్ష డాలర్లకు పైనే ఉండొచ్చని (మన రూపాయలలో 83 లక్షల పైమాటే) అంచనా వేసిన కేన్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సరస్సు వద్దకు వచ్చిన పోలీసులు ఆ పెట్టెను నిశితంగా పరిశీలించారు. దాని యజమానిని గుర్తించే చిహ్నాల కోసం గాలించారు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వాటి స్వంతదారుడిని గుర్తించే వీలులేదని చెబుతూ ఆ పెట్టెను కేన్, అగొస్తిని జంటకే తిరిగిచ్చేశారు.

న్యూయార్క్ లో అమలవుతున్న చట్టాల ప్రకారం.. దొరికిన వస్తువు యజమానిని గుర్తించలేని పక్షంలో ఆ వస్తువు ఎవరికైతే దొరుకుతుందో వారికే సొంతమవుతుంది. ఈ రూల్ ప్రకారం.. సరస్సులో దొరికిన సేఫ్, దానిలోని కరెన్సీ మొత్తం కేన్, అగొస్తిని పరమయ్యాయి. నీటిలో నాని శిథిలావస్థకు చేరిన డాలర్ల నోట్లను బ్యాంకులో మార్చుకునే వీలుండడంతో కేన్ దంపతులు ఆనందం అంతాఇంతా కాదు. అదృష్టం తమను వరించిందని, గతంలో ఎన్నో పెట్టెలు దొరికినా ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు మాత్రం వాటిలో దొరకలేదని చెప్పారు.
US Couple
Magnet Fishing
Newyork lake
1 lakh Dollors
83 lakhs

More Telugu News