Scripps National Spelling Bee Contest: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీ విజేతగా తెలుగుతేజం.. టైటిల్ గెలిచిన 12 ఏళ్ల ఇండియన్–అమెరికన్ విద్యార్థి బృహత్ సోమ

12 Year Old Indian American Wins National Spelling Bee Contest In US
  • ఫైజన్ జకీ అనే మరో విద్యార్థితో టైబ్రేకర్ లో తలపడి విజయం
  • 90 సెకన్లలో ఏకంగా 29 ఆంగ్ల పదాలకు సరైన స్పెల్లింగ్ లు చెప్పిన వైనం
  • రూ. 41.6 లక్షల నగదు బహుమతితోపాటు ఇతర అవార్డుల కైవసం
  • బాలుడి తండ్రి శ్రీనివాస్ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా
అమెరికాలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో ఓ తెలుగుతేజం అద్భుత విజయం సాధించాడు. బృహత్ సోమ అనే 12 ఏళ్ల భారతీయ–అమెరికన్ విద్యార్థి టైటిల్ ను గెలుచుకున్నాడు. సహచర విద్యార్థి ఫైజన్ జకీతో టైబ్రేకర్ లో హోరాహోరీగా తలపడి విజయం సాధించాడు. కేవలం 90 సెకన్ల వ్యవధిలో 30 ఆంగ్ల పదాలకుగాను ఏకంగా 29 పదాలకు సరైన స్పెల్లింగ్ లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నగదు బహుమతి కింద 50,000 డాలర్లతోపాటు (రూ. 41.6 లక్షలు) ట్రోఫీ, ప్రశంసా పత్రం అందుకున్నాడు. 2022లో జరిగిన పోటీలో హరిణి లోగన్ అనే భారతీయ అమెరికన్ విద్యార్థి 90 సెకన్లలో 22 పదాలకు స్పెల్లింగ్ లు చెప్పగా బృహత్ ఆ రికార్డును తిరగరాయడం విశేషం.

అబెసిల్ (abseil) అనే పదానికి చివరగా సరైన స్పెల్లింగ్ ను చెప్పడం ద్వారా బృహత్ ఈ పోటీలో విజయం సాధించాడు. ఫ్లోరిడాకు చెందిన అతను ప్రస్తుతం సెవెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. బృహత్ తండ్రి శ్రీనివాస్ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా కావడం విశేషం. ఈ పోటీలో రన్నరప్ గా నిలిచిన టెక్సాస్ వాసి ఫైజన్ జకీ 25 వేల డాలర్ల (రూ. 20.8 లక్షలు) ప్రైజ్ మనీ సొంతం చేసుకోగా క్యాలిఫోర్నియాకు చెందిన ష్రే పారిఖ్, ఉత్తర కరోలినాకు చెందిన అనన్యరావు ప్రసన్న అనే భారతీయ–అమెరికన్ విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు. వారిద్దరూ చెరో 12,500 డాలర్ల (రూ. 10.4 లక్షలు) ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.

శాన్ ఇవాన్స్ అనే 16 ఏళ్ల విద్యార్థి వద్ద బృహత్ సోమ స్పెల్లింగ్ లు చెప్పడంలో శిక్షణ తీసుకున్నాడు. అతను 2022లో జరిగిన పోటీలో 163వ స్థానంలో నిలవగా 2023లో నిర్వహించిన పోటీలో 74వ స్థానం సాధించాడు. ఈ ఏడాది ఏకంగా టైటిల్ గెలుచుకున్నాడు. ఈ పోటీ ఫైనల్ కు 8 మంది విద్యార్థులు అర్హత సాధించగా వారిలో ఐదుగురు (బృహత్ సోమ, రిషబ్ సాహా, ష్రే పారిఖ్, అదితి ముత్తుకుమర్, అనన్య రావు ప్రసన్న) భారతీయ–అమెరికన్ విద్యార్థులు కావడం విశేషం.
Scripps National Spelling Bee Contest
America
Indian American
Student
Telugu
Community
Bruhat Soma

More Telugu News