Lucknow: కలిసి మందు కొట్టేందుకు నిరాకరించాడని స్నేహితుడిని మేడ పైనుంచి తోసేశాడు!

Video Lucknow Man Pushed Off Roof By Friends For Refusing To Have Liquor
  • కిందపడ్డ బాధితుడిపై దాడి చేసిన మరికొందరు స్నేహితులు
  • యూపీ రాజధాని లక్నోలో దారుణం
  • ఎదురుగా ఉన్న సీసీటీవీలో రికార్డయిన వీడియో
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. కలిసి మందుకొట్టేందుకు నిరాకరించాడన్న కోపంతో రంజీత్ సింగ్ అనే యువకుడిని అతని స్నేహితుడు మేడ పైనుంచి కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా కిందపడ్డ బాధితుడిపై అక్కడే ఉన్న మిగిలిన స్నేహితులు పాశవికంగా దాడి చేశారు. లక్నోలోని రుప్పూర్ ఖాద్రా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన మొత్తం బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలో ఇద్దరు యువకులు డాబాపై పెనుగులాడుతుండగా మరో యువకుడు పక్క నుంచి డాబా ఎక్కుతుండటం కనిపించింది. అనంతరం పిట్టగోడను గట్టిగా పట్టుకున్న రంజీత్ ను మరో యువకుడు అమాంతం పైకెత్తి కింద పడేయడం అందులో రికార్డయింది. రంజీత్ బాధతో విలవిల్లాడుతుంటే కింద నిలబడిన స్నేహితుల్లో ఇద్దరు అతన్ని కాళ్లతో తన్నగా మరో ఇద్దరు యువకులు చోద్యం చూశారు. ఆ సమయంలో పైనుంచి మరో యువకుడు కిందకు దిగాడు. చివరకు ఓ యువకుడు దాడిని ఆపడంతో వీడియో ముగిసింది.

రంజీత్ ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే అంతస్తుగల ఇంటి పైనుంచి పడినందున అతనికి ప్రాణాపాయం తప్పింది. చికిత్స అనంతరం వైద్యులు అతన్ని డిశ్చార్జి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Lucknow
Uttar Pradesh
Man
Thrown Off
Terrace
Beaten
Friends
Arrested

More Telugu News