WHO: కరోనా ఎఫెక్ట్ తో తగ్గిన ఆయుర్దాయం: డబ్ల్యూహెచ్ వో

WHO Says COVID 19 Erased A Decade Of Health Progress In Life Expectancy
  • పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని వివరణ 
  • ఒకటిన్నర సంవత్సరాలు పడిపోయిన లైఫ్ స్పాన్ 
  • పదేళ్ల ప్రగతిని రెండేళ్లలోనే తగ్గించిన కొవిడ్ 
కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదిక వెల్లడించింది. మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది. భారత దేశంలో పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని పేర్కొంది. ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది. 2012లో భారత్ లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లకు కాస్త అటూఇటూగా ఉండేదని, కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది.

కరోనా మహమ్మారికి ముందు.. 2019లో భారత్ లో పౌరుల ఆయుర్దాయం 73 ఏళ్లుగా ఉండేదని వివరించింది. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో పదేళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం తిరుగుముఖం పట్టిందని చెప్పింది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా 61 ఏళ్లకు తగ్గిపోయిందని వివరించింది.

డబ్ల్యూహెచ్ వో విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితా ప్రకారం.. అమెరికా, ఈశాన్య ఆసియాలో 2019 నుంచి 2021 మధ్య మనిషి ఆయుర్దాయం మూడేళ్లు తగ్గిపోయింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవిత కాలం రెండున్నర సంవత్సరాలు తగ్గింది. కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ మనిషి ఆయుర్దాయంపై దీని ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉందని డబ్ల్యూహెచ్ వో సైంటిస్టులు చెప్పారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆయుర్దాయంపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో మనిషి ఆయుర్దాయం ఏడాది కన్నా తక్కువగానే పడిపోయిందని, ఆరోగ్యకరమైన జీవన కాలం కూడా రెండేళ్ల కన్నా తక్కువేనని వివరించారు.
WHO
COVID 19
Life Expectancy
Health Progress

More Telugu News