Statue of LIberty: పంజాబ్ లోని ఇంటిపై 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'!

Statue of Liberty in Punjab Locals Construct Replica in Tarn Taran Video Goes Viral
  • నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు
  • నెట్టింట వైరల్ గా మారిన వీడియో
  • పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే 3.18 లక్షల వ్యూస్

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఉందా? అయితే దీని కోసం మీరు విమానం ఎక్కి న్యూయార్క్ సిటీ వరకు వెళ్లాల్సిన పనిలేదు! జస్ట్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రాన్ని సందర్శిస్తే చాలు.. అక్కడే ఈ విగ్రహం కనువిందు చేస్తుంది!! ఇదేం విచిత్రం అంటారా? పంజాబ్ లోని తర్న్ తరణ్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా అందరినీ ఆకర్షిస్తోంది. దీన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. విగ్రహాన్ని వీడియో తీసి సోషల్  మీడియాలో పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే దీనికి 3.18 లక్షల వ్యూస్ లభించాయి.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా విగ్రహాన్ని క్రేన్ సాయంతో కొందరు వ్యక్తులు భవనంపై ఏర్పాటు చేయడం ఆ వీడియోలో కనిపించింది. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో అలోక్ జైన్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ‘పంజాబ్ లోని ఏదో ప్రాంతంలో మూడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం’ అంటూ ఆ వీడియో కింద క్యాప్షన్ పెట్టాడు. దీన్ని చూసిన నెటిజన్లంతా రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఓ యూజర్ స్పందిస్తూ ‘అది మంచినీళ్ల ట్యాంకు అయ్యుంటుంది. పంజాబ్ లో చాలా మంది ఇళ్లపై మంచి నీళ్ల ట్యాంకులు విమానాలు, ఎస్ యూవీల ఆకారంలోనే కనిపిస్తాయి’ అని పేర్కొన్నాడు. మరొకరేమో ‘నయాగారా ఫాల్స్ ను నిర్మించాల్సింది.. అప్పుడు కెనడాను మిస్ అయ్యే వాళ్లు కాదు’ అని చమత్కరించాడు. ‘ఇక ప్రజలు న్యూయార్క్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.పంజాబ్ లోని ఈ ఇంటిని చూసేందుకు వెళ్తే సరిపోతుందన్నమాట’ అని కామెంట్ చేశాడు. ‘గ్రామీణ పంజాబ్ లో ప్రజలు నీళ్ల ట్యాంకులను ఫుట్ బాల్, మత చిహ్నాలు, వాహనాల ఆకారంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో కొందరైతే తాము విదేశాల్లో స్థిరపడ్డామనే విషయాన్ని గొప్పగా చాటుకొనేందుకు విమానాల ఆకారంలోనూ నీళ్ల ట్యాంకులు నిర్మిస్తున్నారు’ అని రాజేష్ వోరా అనే ఫొటోగ్రాఫర్ చెప్పుకొచ్చాడు.


  • Loading...

More Telugu News