IPL 2024: ఐపీఎల్ అవార్డ్స్ విన్న‌ర్లు.. పూర్తి జాబితా ఇదిగో!

IPL 2024 Awards Full List
  • టోర్నీలో అత్య‌ధిక ప‌రుగుల (741) తో 'ఆరెంజ్ క్యాప్' ద‌క్కించుకున్న కోహ్లీ
  • 24 వికెట్లు తీసి 'ప‌ర్పుల్ క్యాప్' సొంతం చేసుకున్న హ‌ర్ష‌ల్ ప‌టేల్‌
  • అత్యంత విలువైన ఆట‌గాడిగా సునీల్ న‌రైన్ 
  • తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి 'ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్' అవార్డు

ఐపీఎల్ 17వ సీజ‌న్ ముగిసింది. ఆదివారం నాటి ఫైన‌ల్‌తో ఈ సీజ‌న్‌కు తెర‌ప‌డింది. మార్చి 22న చెన్నై వేదిక‌గా ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌తో ప్రారంభ‌మైన టోర్నీ.. ఇదే వేదిక‌గా కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ మ‌ధ్య జ‌రిగిన ఫైనల్‌తో ముగిసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని కోల్‌క‌తా విజేత‌గా నిలిచింది. ముచ్చ‌ట‌గా మూడోసారి కేకేఆర్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ సీజ‌న్‌లో మొత్తం 74 మ్యాచులు జ‌రిగాయి. లీగ్ ద‌శ‌లో రాణించి టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన కేకేఆరే టైటిల్ ఎగిరేసుకుపోయింది. 

ఇక ఈ సీజ‌న్‌లో ప‌లువురు ఆటగాళ్లు త‌మ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుని అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇలా సీజ‌న్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వాటిలో అత్య‌ధిక ప‌రుగులు, అత్య‌ధిక వికెట్లు, అత్యంత విలువైన ఆట‌గాడు ఇలా ప‌లు అవార్డ్స్ ఉన్నాయి. 

ఈ 17వ సీజ‌న్‌లో అద్భుతంగా రాణించిన ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ 15 మ్యాచుల్లో ఏకంగా 741 ప‌రుగులు బాదాడు. ఇందులో 5 అర్ధ శ‌త‌కాలు, ఒక శ‌త‌కం ఉంది. దీంతో టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచిన కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ ద‌క్కింది. అలాగే బౌలింగ్‌లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు చెందిన హ‌ర్ష‌ల్ ప‌టేల్ అత్య‌ధికంగా 24 వికెట్లు ప‌డ‌గొట్టి ప‌ర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. 

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్లేయ‌ర్ సునీల్ న‌రైన్ అత్యంత విలువైన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ ఏడాది బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అద‌ర‌గొట్టిన ఈ విండీస్ ఆల్‌రౌండ‌ర్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సొంతం చేసుకున్నాడు.    

ఐపీఎల్ 2024 మొత్తంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న‌ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌) కి ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డు ద‌క్కింది. 21 ఏళ్ల నితీశ్ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 303 ప‌రుగులు చేశాడు. 142.92 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఇందులో 21 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. ఎల‌క్ట్రిక్ స్ట్రైక‌ర్ అవార్డు యువ సంచ‌ల‌నం ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ క్యాపిట‌ల్స్‌)ను వ‌రించింది. 

అలాగే సూప‌ర్ క్యాచ్ అవార్డు కోల్‌క‌తా ప్లేయ‌ర్ ర‌మ‌ణ్‌దీప్ గెలిచాడు. సూప‌ర్ సిక్సెస్ పుర‌స్కారం ఎస్ఆర్‌హెచ్ యువ ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ‌కు ద‌క్కింది. టోర్నీ మొత్తంలో అత‌డు ఏకంగా 42 సిక్సులు బాదాడు. అలాగే ఫెయిర్ ప్లే అవార్డును స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు సొంతం చేసుకుంది.  

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు 
ఇక ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు అత్యంత విలువైన ఆట‌గాడిగా నిలిచిన ప్లేయర్‌గా సునీల్ న‌రైన్ రికార్డు నెల‌కొల్పాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్ల‌లో అత‌డు ఈ ఘ‌న‌త న‌మోదు చేయ‌డం విశేషం. 2012లో 24 వికెట్లు తీసి తొలిసారి ఈ ఘ‌న‌త సాధించాడు. ఆ తర్వాత 2018లో 357 ప‌రుగులు, 17 వికెట్లు.. 2024లో 17 వికెట్లు, 488 ర‌న్స్‌తో రాణించి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు.

  • Loading...

More Telugu News