IPL 2024: 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

KKR vs SRH Final match making it the shortest playoff match in the history of IPL
  • ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ఓవర్ల పరంగా అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌గా రికార్డు
  • కేవలం 29 ఓవర్లు మాత్రమే కొనసాగిన మ్యాచ్
  • సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో ఆలౌట్.. 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కోల్‌కతా

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 ముగిసింది. 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని ముద్దాడారు. మూడోసారి టైటిల్‌ గెలవాలనుకున్న సన్‌రైజర్స్‌కు నిరాశే మిగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్వల్ప టార్గెట్‌ను కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. కేవలం 10.3 ఓవర్లలో 8 వికెట్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. దీంతో ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మొత్తం 29 ఓవర్ల పాటు మాత్రమే కొనసాగిన ఈ మ్యాచ్.. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన ప్లేఆఫ్ మ్యాచ్‌గా నిలిచింది.

2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ ఛార్జర్స్ మధ్య జరిగిన ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ 32.2 ఓవర్ల పాటు కొనసాగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ 18.3 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో 13.5 ఓవర్లలో ఆర్సీబీ మ్యాచ్‌ను ముగించింది. ఆ రికార్డు ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌తో చెరిగిపోయింది.

కాగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్ల ముందు అందరూ తేలిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకొని మ్యాచ్‌ను దూరం చేసుకున్నారు. 24 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడంటే ఆ జట్టు ఆటగాళ్లు ఎంత దారుణంగా విఫలమయ్యారో చెప్పుకోవచ్చు. లక్ష్య ఛేదనలో వెంకటేశ్ అయ్యర్ అజేయ అర్ధశతకంతో ఆ జట్టు సునాయాసంగా గెలిచింది.

  • Loading...

More Telugu News