Arvind Kejriwal: భారత ఎన్నికలపై ట్వీట్ చేసిన పాకిస్థాన్ ఎంపీకి కేజ్రీవాల్ దిమ్మతిరిగే కౌంటర్!

Take care of your country Arvind Kejriwal responds to Pakistan MP Fawad Chaudhry comments
  • ఢిల్లీలో కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకొని ట్వీట్ చేసిన కేజ్రీవాల్
  • కేజ్రీవాల్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని పేర్కొన్న పాక్ ఎంపీ
  • ముందు మీ దేశం గురించి ఆలోచించుకోవాలని కేజ్రీవాల్ చురక
  • భారత్‌లో ఎన్నికలు మా అంతర్గత విషయం... ఉగ్రవాద దేశ జోక్యం అవసరం లేదంటూ మండిపాటు

భారత సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్ చేసిన పాకిస్థాన్ ఎంపీ ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మా దేశం గురించి మేం చూసుకుంటాం... కానీ ముందు అంతంత మాత్రంగానే ఉన్న మీ దేశం గురించి ఆలోచించుకోండన్నారు. అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 'నా భార్య, తండ్రి, పిల్లలతో కలిసి ఓటు వేశాను. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఆమె రాలేకపోయింది. నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్భణానికి వ్యతిరేకంగా నేను ఓటు వేశాను. మరి మీరు కూడా వెళ్లి ఓటు వేయండి' అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను ఫవాద్ చౌదరి రీట్వీట్ చేస్తూ... ద్వేషం, అతివాదభావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్ చేశారు. మోర్ పవర్, ఇండియా ఎలక్షన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. పాక్ ఎంపీ ట్వీట్‌పై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.

'చౌదరీ సాబ్, నేను, మా దేశ ప్రజలం మా సమస్యలను పరిష్కరించుకోగలం. మీ జోక్యం ఇందులో అవసరం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. మీరు మీ దేశం గురించి ఆలోచించుకోండి. భారతదేశంలో ఎన్నికలు మా అంతర్గత విషయం. ఇందులో ఉగ్రవాదానికి నిలయమైన మీ దేశ జోక్యాన్ని భారత్ సహించదు' అని కౌంటర్ ఇచ్చారు.

కేజ్రీవాల్ కౌంటర్‌పై ఫవాద్ చౌదరి

ముఖ్యమంత్రి గారూ, (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) నిజానికి ఎన్నికలు మీ సొంత విషయమే కానీ తీవ్రవాదం పాకిస్థాన్‌లో ఉన్నా... ఎక్కడ ఉన్నా అందరికీ ప్రమాదకరమే అన్నారు. ఆదర్శవంతమైన వ్యక్తులు మెరుగైన సమాజం కోసం ప్రయత్నించాలన్నారు. పాకిస్థాన్ అంశం లేకుండా భారత రాజకీయ నాయకుల ప్రసంగం పూర్తి కాదని పేర్కొన్నారు. కానీ అదే పాకిస్థాన్‌లో భారత రాజకీయాల గురించి ఎవరూ పట్టించుకోరన్నారు. బీజేపీ యాంటీ ముస్లిం సెంటిమెంట్ కోసం పాకిస్థాన్ పేరును ఉపయోగిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News