West Bengal: ఆరో విడత పోలింగ్... బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నం... సెక్యూరిటీకి గాయాలు

BJP Candidate Pranat Tudu Attacked in Jhargram

  • ఝర్‌గ్రామ్ బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై దాడికి యత్నించిన టీఎంసీ వర్గీయులు
  • ప్రణత్ భద్రతా సిబ్బందికి గాయాలు... ఆసుపత్రిలో చికిత్స
  • టీఎంసీ రౌడీలు దాడికి పాల్పడ్డారన్న ప్రణత్ తుడు
  • బీజేపీ అభ్యర్థి ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారని టీఎంసీ ప్రత్యారోపణ

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కొన్నిచోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఝర్‌గ్రామ్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని గార్బేట ప్రాంతంలో ఆయన కాన్వాయ్‌పై దాడికి యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది ఆయనను తప్పించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొన్ని పోలింగ్ బూత్‌లలోకి బీజేపీ ఏజెంట్లను అనుమతించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆయన గార్బేటకు బయలుదేరారు.

'హఠాత్తుగా రోడ్లను దిగ్బంధించిన టీఎంసీ రౌడీలు నా కారుపై ఇటుకలను విసిరారు. నా సెక్యూరిటీ సిబ్బంది జోక్యంతో నేను బయటపడ్డాను. ఈ ఘటనలో వారు గాయపడ్డారు. నాతో పాటు వస్తున్న ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ జవాన్ల తలలకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింద'ని బీజేపీ అభ్యర్థి తుడు తెలిపారు. ఇక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. 

కాగా, బీజేపీ ఆరోపణలను స్థానిక టీఎంసీ నాయకులు ఖండించారు. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా కొనసాగుతుండగా బీజేపీ అభ్యర్థి ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి ఓటర్లను బెదిరించారని... గ్రామస్తులు ఆగ్రహించి ఆయనకు నిరసన తెలిపారన్నారు.

More Telugu News