Bandi Sanjay: రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని చెప్పలేదు... ఐనా కాంగ్రెస్ వాళ్లు ఇంకో పార్టీకి ఆ అవకాశం ఇస్తారా?: బండి సంజయ్ సెటైర్

Bandi Sanjay satires on congress leaders
  • ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గపు ఆలోచన తమకు లేదన్న బండి సంజయ్
  • ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు పాలించాలని బీజేపీ కోరుకుంటుందని వ్యాఖ్య
  • కానీ, వాళ్లలో వాళ్లు కొట్టుకుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్న
  • పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలను ప్రజలు రోడ్ల మీద తిరగనివ్వరన్న సంజయ్
  • కాళేశ్వరం తర్వాత పౌరసరఫరాలో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్న బీజేపీ నేత

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని... పడిపోతుందని తాము ఎక్కడా చెప్పలేదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అయినా తమ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కాంగ్రెస్ నేతలు ఇంకో పార్టీకి ఇస్తారా? వారు ఇంకొకరికి ఇవ్వరని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కాంగ్రెస్ వాళ్లు మరొకరికి ఇవ్వరని (తమ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలే పడగొట్టుకుంటారనే ఉద్దేశ్యంలో) వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గపు ఆలోచన తమకు లేదన్నారు. ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు పాలించాలని కోరుకుంటామని... కానీ వాళ్లలో వాళ్లు కొట్టుకుంటే మేమేం చేస్తామని వ్యాఖ్యానించారు. ఒక్కటి గుర్తుంచుకోండి... పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రోడ్ల మీద నడిచే పరిస్థితి ఉండదని జోస్యం చెప్పారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలు వారిని నిలదీస్తారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణలో కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా ఉందని విమర్శించారు. పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతి బయటపడాల్సి ఉందన్నారు. రైస్ మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారణ కాళేశ్వరం విచారణలా మిగిలిపోకూడదన్నారు. పౌరసరఫరాల శాఖ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు పౌరసరఫరాల శాఖలో అవినీతి జరిగిందన్నారు.

తెలంగాణలో కాళేశ్వరం తర్వాత అతిపెద్ద స్కాం పౌరసరఫరాల శాఖలో జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 590 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే... కేసీఆర్ 290 టీఎంసీలకే అంగీకరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడినట్లే కాంగ్రెస్ కూడా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఆ మొత్తాన్ని ఢిల్లీకి పంపిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఒక్క రైతు ఖాతాలో కూడా రూ.500 బోనస్ పడలేదన్నారు. తాము అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెబుతున్నామని... కానీ ఇతర పార్టీలు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నాయన్నారు. 80 శాతం హిందువులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామన్నారు.

  • Loading...

More Telugu News