Gaza Zookeeper: ఇజ్రాయెల్ హెచ్చరికలతో రఫా సిటీని వదిలిన జూ కీపర్.. జంతువులనూ కాపాడుకున్న వైనం

Gaza Zookeeper Flees Rafah Creates Temporary Home For Animals
  • మూగజీవాలకు టెర్రరిజంతో సంబంధంలేదంటూ ఇజ్రాయెల్ కు విజ్ఞప్తి
  • టైం సరిపోక మూడు సింహాలను రఫాలోని జూలోనే వదిలేసినట్లు వివరణ
  • వారం పది రోజుల్లో వాటిని కాపాడకుంటే అవి ప్రాణాలు వదిలేస్తాయని ఆవేదన

ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల నేపథ్యంలో గాజాలోని రఫా సిటీ వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోయారు. బతికి బట్టకడితే చాలంటూ ఇల్లూ, వాకిలి వదిలి ఉన్నపళంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలాంటి ఆపత్కాలంలోనూ ఓ జూ కీపర్ తన విధి నిర్వహణ మరువలేదు. ఇంతకాలం తను జాగ్రత్తగా కాపాడుకున్న జంతువులను వెంట తీసుకెళ్లాడు. పక్షుల నుంచి సింహాల దాకా.. చిన్నా పెద్ద జంతువులను, పక్షులను సేఫ్ గా ఖాన్ యూనిస్ కు తరలించాడు. అయితే, సమయం సరిపోక మూడు పెద్ద సింహాలను జూలోనే వదిలేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రఫా సిటీలో దాడులు ప్రారంభించే మందు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఉన్నపళంగా సిటీని ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో జనం ఉరుకులు పరుగులు పెట్టారు. పిల్లాపాపలతో ఊరు వదిలేసి ఖాన్ యూనిస్ కు చేరుకున్నారు. దాదాపు 8 లక్షల మంది రఫా సిటీని వదిలేసి వెళ్లినట్లు సమాచారం. ఇందులో ఫతీ అహ్మద్ గోమా అనే జూ కీపర్ కూడా ఉన్నాడు. తను ఇంతకాలం పనిచేసిన జూ ను వదిలి వెళ్లాల్సి రావడంతో తనతో పాటే ఆ జంతువులనూ వెంట తీసుకెళ్లాడు.

ఖాన్ యూనిస్ లోని ఓ గోశాలలో తాత్కాలికంగా వాటికి షెల్టర్ ఏర్పాటు చేశాడు. ఫెన్సింగ్ వేసి సింహాలతో పాటు ఇతరత్రా జంతువులను, పక్షులను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అయితే, మూడు పెద్ద సింహాలను తరలించే టైంలేక రఫాలోని జూలోనే వదిలి వచ్చానని గోమా చెప్పాడు. వాటికి తిండి, నీళ్లు ఇచ్చే వారు లేరని, వారం పదిరోజుల్లో ఆహారం అందక అవి మరణించే ప్రమాదం ఉందని వాపోతున్నాడు. జంతువులకు టెర్రరిజంతో సంబంధంలేదని, జూలోని సింహాలను కాపాడేందుకు అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్ కు ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.


  • Loading...

More Telugu News