Siddaramaiah: తన 'లవ్ స్టోరీ' గురించి చెప్పుకొచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Karnataka CM Siddaramaiah Tells His LoveStory At a marriage  unction in Mysuru
  • కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పిన సీఎం
  • తమ పెళ్లికి వాళ్ల పేరెంట్స్ ఒప్పుకోలేదని వివరణ
  • కులం తమను విడదీసిందని వ్యాఖ్య

కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించానని, అయితే, కులాలు వేరు కావడంతో ఆమెను పెళ్లి చేసుకోలేకపోయానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన కులాంతర వివాహ వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులాంతర వివాహాలకు మద్ధతుగా సీఎం మాట్లాడారు. తన కాలేజీ రోజులను, తొలి ప్రేమను గుర్తుచేసుకున్నారు. సీఎం సిద్ధూకు ఓ లవ్ స్టోరీ ఉందని, అదీ ఆయన ద్వారానే తెలియడంతో ఆ వేదిక చప్పట్లు, అరుపులు కేకలతో హోరెత్తిపోయింది.

ఆ రోజు ఒక్కటవుతున్న జంటలను ఆశీర్వదించిన సిద్ధరామయ్య.. పెళ్లి తంతు పూర్తయ్యాక వధూవరులతో పాటు అక్కడున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. కులాంతర వివాహాలు జరగాల్సిన అవసరం ఎంతో ఉందని, కుల వివక్ష రూపుమాపేందుకు ఇలాంటి పెళ్లిళ్లు తోడ్పడతాయని చెప్పుకొచ్చారు. వాస్తవంగా తాను కూడా అప్పట్లోనే కులాంతర వివాహానికి మొగ్గు చూపానని, అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు అంగీకరించలేదని చెప్పారు. 

‘చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ఇష్టపడ్డా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని అనుకున్నా. వాళ్ల తల్లిదండ్రులను వెళ్లి కలిశా. కానీ మా కులాలు వేరు కావడంతో వాళ్ల పేరెంట్స్ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక పోయా. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో మా కులంలోనే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది’ అంటూ సీఎం సిద్ధరామయ్య తన లవ్ స్టోరీని బయటపెట్టారు. కులాంతర వివాహాలు, వెనకబడిన కులాలను ఆర్థికంగా పైకి తీసుకురావడం ద్వారా సమాజంలో సమానత్వం సాధించవచ్చని సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News