Haridwar: వ్యర్థాలతో నిండిపోయిన హరిద్వార్ లోని గంగా నది ఘాట్.. వీడియో వైరల్

Viral Video of Haridwars Har Ki Pauri Littered with Plastic Clothes Sparks Outrage
  • భక్తుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న నెటిజన్లు
  • పవిత్ర ప్రదేశం చెత్తాచెదారంతో నిండిపోవడంపై ఆవేదన
  • ప్రజలు, ప్రభుత్వం బాధ్యతాయుతంగా మెలగాలని సూచన
ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్ లోని గంగా నది ఘాట్ చెత్త కుప్పలా మారిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బుద్ధ పూర్ణమ సందర్భంగా గంగలో పుణ్యస్నానాలు, పూజల కోసం భారీగా తరలి వచ్చిన భక్తులు ప్లాస్టిక్ కవర్లు, పూజా సామగ్రి, విడిచిన బట్టలను అక్కడే పడేసి వెళ్లారు. దీంతో ఆ ప్రాంతం వ్యర్థాలతో నిండిపోయింది. అయినప్పటికీ మరికొందరు భక్తులు నదిలో స్నానాలు చేస్తునే ఉన్నారు. ఏ ఒక్కరూ చెత్తను తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ‘ఎక్స్’ ఖాతాలో కనిపించడంతో దాన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

‘హరిద్వార్ లోని హర్ కీ పౌరీ వీడియో ఇది. ప్రభుత్వమే అన్ని పనులూ చేయలేదు. భక్తులు వారు తీసుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను కనీసం చెత్త కుండీల్లో కూడా వేయలేరా’ అంటూ తాను తీసిన వీడియో కింద ఆస్క్ భూపీ పేరుగల నెటిజన్ పోస్ట్ పెట్టాడు. పోస్ట్ చేసిన కొంతసేపటికే ఈ వీడియోకు 17 వేలకుపైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు భక్తుల తీరుపై మండిపడగా మరికొందరు ప్రభుత్వం చెత్త నిర్వహణలో విఫలమైందని విమర్శించారు.

‘ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుంది. భక్తులు వారు చేస్తున్న పనులను గుర్తెరగాలి. అధికారులు తగిన సౌకర్యాలు కల్పించాలి’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ పవిత్రమైన ప్రదేశం దుస్థితి చూసి మనసు తరుక్కుపోతోందని పేర్కొన్నాడు. మరొకరేమో ‘ప్రజలకు గంగా మాతపై నమ్మకం లేదు. వారు కేవలం హంగూ ఆర్భాటం చాటేందుకే ఇక్కడకు వస్తారు. వారు స్నానం చేసేందుకు గంగానది పరిశుభ్రంగా ఉండాలంటారు. కానీ గాంగా నది ఘాట్ పరిశుభ్రతను మాత్రం పట్టించుకోరు. ఇలాంటి వారిని శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. భారతదేశం గొప్పదైనప్పటికీ పరిశుభ్రత, పౌర బాధ్యతల నిర్వహణలో భారతీయులు మాత్రం అత్యంత చెత్తవారని మండిపడ్డాడు.
Haridwar
Har Ki Pauri
Ghat
Litter
Video Viral
Netizens
Worried

More Telugu News