Jupalli Krishna Rao: శ్రీధర్ రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవడానికే నాపై నిందలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupalli Krishna Rao takes on KTR and RSP on Sridhar Reddy murder case
  • తాను, పొంగులేటి బీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేశాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందన్న జూపల్లి
  • అందుకే తనపై కోపంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
  • శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయన్న జూపల్లి కృష్ణారావు
  • సీబీఐ విచారణకు... జ్యుడీషియల్ విచారణకూ సిద్ధమన్న మంత్రి

తాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌పై ఎప్పుడైతే తిరుగుబాటు చేశామో... అప్పుడు ఆ పార్టీపై కోలుకోలేని దెబ్బపడిందని... ఆ కోపంతో తనపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవడానికి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందన్నారు. ఈ హత్యపై పూర్తి వివరాలు తెలియకుండా తప్పుడు ఆరోపణలు సరికాదన్నారు. శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నారు. ఈ విషయం మండలంలో అందరికీ తెలుసునని చెప్పారు. కారణం ఏదైనా కావొచ్చు... ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని... దోషులకు శిక్ష పడాలన్నారు.

బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గతంలో తమ కార్యకర్తలు చనిపోయినప్పుడు తాము ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. హత్యలకు, రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదన్నారు. శ్రీధర్ రెడ్డికి ఆయన కుటుంబంతోనే తగాదాలు ఉన్నాయని జూపల్లి పేర్కొన్నారు. కానీ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు తేలుస్తారన్నారు. కానీ తనపై అసత్య ప్రచారం సరికాదన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే గ్రామానికి వచ్చి ప్రజలను అడిగి నిజం తెలుసుకోవాలని సూచించారు. ఈ హత్య కేసులో సీబీఐ విచారణకు... జ్యుడీషియల్ విచారణకు కూడా తాను సిద్ధమన్నారు. హత్య విషయంలో తనపై నిందలు వేస్తోన్న కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News