buddha venkanna: లోకేశ్ కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి: బుద్దా వెంకన్న డిమాండ్

buddha venkanna demands tdp ap reins be handed over to nara lokesh
  • ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారని వెల్లడి
  • ఇద్దరూ ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలని సూచన
  • అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 130కిపైగా స్థానాల్లో గెలుస్తుందని జోస్యం

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ కు అధినేత చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇవ్వాలని... రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని అన్నారు. ఇది తమ వినతి కాదని.. డిమాండ్ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘పార్టీ కోసం లోకేశ్ 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే పార్టీని కాపాడేందుకు పాదయాత్రకు విరామం ప్రకటించి ఢిల్లీ వెళ్లి లాయర్లతో సమావేశమయ్యారు. పార్టీని కాపాడే శక్తి లోకేశ్ కు ఉంది. పార్టీ పగ్గాలు లోకేశ్ కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉన్నా ఆయన కులమతాల లెక్కలు చూస్తారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఏమైనా అనుకుంటారేమోనని భావిస్తున్నారు. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ చంద్రబాబు వెనకాలే ఉంటారు. కాబట్టి ఈ పదవి ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. పార్టీ రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని లోకేశ్ ను కోరుతున్నాం’ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 130కిపైగా స్థానాల్లో గెలుస్తుందని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. రాష్ట్ర టీడీపీ బాధ్యతలు లోకేశ్ ‌కి అప్పగించాలన్నారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి.. నలుగురూ నాలుగు దిక్కులా పార్టీ కోసం పనిచేశారని ఆయన చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టినా భయపడని అచ్చెన్నాయుడుకు ప్రమోషన్ ఇవ్వాలని బుద్దా వెంకన్న చంద్రబాబును కోరారు. ఇప్పటి వరకూ సమర్థంగా పనిచేసిన ఆయనకు కేబినెట్‌లో కీలక మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో తనకో పేజీ ఉంటుందని పేర్కొన్నారు. తాను చంద్రబాబు పాదాలను తన రక్తంతో కడిగానన్నారు.

  • Loading...

More Telugu News