Rajasthan Royals: గెలిస్తే ఫైనల్‌కి.. ఓడితే ఇంటికి.. రాజస్థాన్ వర్సెన్ సన్‌రైజర్స్ బలాబలాలు ఇవే!

Rajasthan Royals and Sunrisers Hyderabad struggled in the second half of the 2024 season ahead of Qualifier 2
  • ఐపీఎల్ 2024 ద్వితీయార్ధంలో తడబాటుకు గురైన ఇరు జట్లు
  • నేడు కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో అమీతుమీ
  • పవర్ హిట్టింగ్ బ్యాటర్లనే నమ్ముకున్న సన్‌రైజర్స్
  • ఆర్సీబీపై విజయంతో మంచి ఊపుమీద ఉన్న రాజస్థాన్ రాయల్స్
  • నేటి రాత్రి 7.30 గంటలకు కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్

ఐపీఎల్-2024లో ఫైనల్ చేరే మరో జట్టు ఏది?.. అనే ఉత్కంఠకు నేటి (శుక్రవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌తో తెరపడనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కీలకమైన మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల బలాబలాలను విశ్లేషిస్తే... ఐపీఎల్-2024లో ద్వితీయార్ధంలో ఇరు జట్లు నిలకడగా రాణించలేకపోయాయి. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నప్పటికీ లీగ్ దశ చివరి మ్యాచ్‌ల్లో తడబాటు కనిపించింది.

సన్‌రైజర్స్ పరిస్థితి ఇదీ...
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. దీంతో ఆ జట్టు బ్యాటర్లు లీగ్ తొలి దశలో విధ్వంసాలు సృష్టించారు. దూకుడు శైలిని కొనసాగించి పలు రికార్డులు బద్దలు కొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో ఆడారు. ఇక మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ 180కిపైగా స్ట్రైక్ రేట్‌ కీలకమైన పలు ఇన్నింగ్స్ ఆడాడు. యువ బ్యాటర్లు అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి పలు కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ ప్లేయర్లే నేటి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. డూ-ఆర్‌ డై మ్యాచ్‌లో వీరిలో ఏ ఇద్దరు ఆటగాళ్లు రాణించినా చెన్నైలో పరుగుల వరద పారే అవకాశం ఉంటుంది.

అయితే గత మ్యాచ్‌లను పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కాస్త ఆందోళనకరంగా ఉందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నమ్మకమైన బౌలర్లుగా ఉన్న పాట్ కమ్మిన్స్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్ కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుని ఆందోళనకు గురిచేస్తోంది.

వరుస ఓటముల తర్వాత విజయపథంలోకి..
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్-2024 తొలి అర్ధభాగంలో అద్భుతంగా రాణించింది. టేబుల్ టాపర్‌గా కొనసాగుతూ వచ్చింది. అయితే మలి అర్ధభాగంలో ఆ జట్టు డీలా పడింది. అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు కూడా రద్దు కావడం ఆ జట్టుపై ప్రభావం చూపింది. అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అద్భుతంగా ఆడి సంచలన రీతిలో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆర్సీబీని రాజస్థాన్ ఓడించింది. మరి నేటి క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి ఒక ఎడిషన్‌లో 500లకు పైగా పరుగులు చేశాడు. ఇక యువ బ్యాటర్ రియాన్ పరాగ్ కూడా నిలకడగా ఆడుతున్నారు. మ్యాచ్‌ను గెలిపించే ప్రదర్శనలు చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మీద కూడా ఆ జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్ క్రికెటర్ జాస్ బట్లర్ అందుబాటులో లేకపోవడంతో టామ్ కోహ్లర్‌ను ఓపెనర్‌గా పంపించనుంది.

ఇక బౌలింగ్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సహా స్పిన్నర్ యజువేంద్ర చాహల్, సందీప్ శర్మ కీలకమైన వికెట్లు తీస్తున్నారు. ఇక అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో కూడా జట్టుకి నాణ్యమైన బౌలర్లు కనిపిస్తున్నారు. మరి నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు ఏ విధంగా రాణిస్తారో వేచిచూడాలి. కాగా ఇరు జట్లు ఐపీఎల్‌లో 19 సార్లు పోటీ పడగా తొమ్మిది విజయాలతో హైదరాబాద్‌కే స్వల్ప ఆధిపత్యం కనిపిస్తోంది.

తుది జట్ల అంచనా ...

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, విజయకాంత్ వియాస్కాంత్.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.

  • Loading...

More Telugu News