Rammohan Reddy: అప్పుడు సోనియాగాంధీ కాళ్లు మొక్కలేదా మీరు? ఇప్పుడు ఆమెను ఆహ్వానిస్తామంటే వద్దంటారా?: పరిగి ఎమ్మెల్యే ఫైర్

Parigi MLA fires at Harish Rao for objecting sonia gandhi to Telangana
  • తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబం సోనియా గాంధీ వద్దకు వెళ్లిందన్న రామ్మోహన్ రెడ్డి
  • ఇప్పుడు ఏ హోదాలో దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తారని హరీశ్ రావు అనడం సరికాదని వ్యాఖ్య
  • సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పడిందన్న పరిగి ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మొత్తం వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిందని... ఇప్పుడు ఆమెను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తే తప్పేమిటని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీని ఏ హోదాలో దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. దీంతో ఆయనపై రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. యువకుల ఆత్మహత్యలు చూసి, బీడు బారిన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని, నిధులతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల బాధను చూడలేక కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే... కేసీఆర్ మాత్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు.

సోనియా గాంధీని తెలంగాణ దేవతగా ప్రజానీకం గౌరవిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ వ్యతిరేకులకు విందు భోజనాలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ వాళ్లే అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారిని మంత్రివర్గంలోకి తీసుకున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. బీజేపీ, సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియా గాంధీని ప్రశంసించారని రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు.

కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. బోనస్‌ను సన్న వడ్లతో ప్రారంభించి... దొడ్డు వడ్ల వరకు కొనసాగిస్తామన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రులు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. మంత్రులపై బీజేపీఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన దగ్గర ఆధారాలే కాదు... ప్రభుత్వం ఎన్ని టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందనే డేటా కూడా తప్పుగానే ఉందన్నారు.
Rammohan Reddy
Parigi
Congress
Sonia Gandhi
Harish Rao

More Telugu News