Arvind Kejriwal: సీఎం పదవికి రాజీనామా చేయను... అలా చేస్తే బీజేపీకి ఆ అవకాశం ఇచ్చినట్లే: కేజ్రీవాల్

Won not resign because it will set precedent says Delhi CM
  • తనకు అధికారం ముఖ్యం కాదని వ్యాఖ్య
  • గతంలో తాను ముఖ్యమంత్రి పదవిని వదిలేశానని గుర్తు చేసిన కేజ్రీవాల్
  • రాజీనామా చేస్తే మరో సీఎంను అరెస్ట్ చేసేందుకు బీజేపీకి అవకాశమిచ్చినట్లే అవుతుందని వ్యాఖ్య
  • మమతా బెనర్జీ.. స్టాలిన్‌లను కూడా అరెస్ట్ చేయవచ్చునన్న కేజ్రీవాల్
  • అందుకే రాజీనామా చేయడం లేదని స్పష్టీకరణ

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ... తనకు అధికారం ముఖ్యం కాదన్నారు. మేం ప్రభుత్వంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది అనవసరమని వ్యాఖ్యానించారు. అది టైమ్ మాత్రమే నిర్ణయిస్తుందన్నారు. కానీ హామీలను పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

గతంలో ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ పదవిని వదులుకొని మురికివాడల్లో పని చేశానన్నారు. 2013లో సీఎం పీఠమెక్కినప్పటికీ 49 రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఆనాడు ఎందుకు రాజీనామా చేశావు? అని ఎవరూ అడగలేదన్నారు. చిన్న ఉద్యోగాన్ని కూడా ఎవరూ వదులుకోరు... కానీ తాను సీఎం పదవినే వదిలేశానన్నారు. ప్రస్తుతం తాను ప్రజల కోసం పోరాడుతున్నానని... అందుకే రాజీనామా చేయడం లేదన్నారు.

2015లో తమ పార్టీ 67 సీట్లు, 2020లో 62 సీట్లు గెలుచుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో తమను ఓడించలేమని గుర్తించిన మోదీ... తనను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తప్పుడు కేసులతో తమ వారిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తాను కనుక సీఎం పదవికి రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కేంద్రంలోని బీజేపీకి ఇచ్చినట్లే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అరెస్ట్ చేయవచ్చునని.. అందుకే రాజీనామా చేయనని తేల్చి చెప్పారు.

జైల్లో తనను వేధించారని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే వారి ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కాబోవన్నారు. జైల్లో ఉండి ఢిల్లీ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు వీలుగా అవకాశం కల్పించాలని తాను కోర్టును కోరుతానన్నారు.

  • Loading...

More Telugu News