T20 World Cup: ఇండియా–పాకిస్థాన్​ మ్యాచ్​ టికెట్ రేటు​ రూ.16 లక్షలా..?: లలిత్ మోదీ ఫైర్

16 lakhs per seat for india pak t20 world cup match
  • క్రికెట్ కౌన్సిల్ కాదు క్రూక్స్ కౌన్సిల్ అంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యాఖ్యలు 
  • ఆట విస్తరణ, అభిమానుల కోసమే అమెరికాలో టీ20 కప్ నిర్వహణ అని వెల్లడి
  • మరోవైపు టికెట్ ధరలపై ఐసీసీ నుంచి స్పష్టత రాని వైనం
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలవబోతోంది. అందులోనూ ఇండియా–పాకిస్థాన్ జట్లు తలపడబోతుండటం క్రికెట్ ప్రియులకు మరింత ఉత్కంఠను రేపుతోంది. అమెరికా, వెస్టిండీస్ లలో జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్ లపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్ ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

స్టేడియంలో టికెట్ల రేట్లపై..
జూన్ 9వ తేదీన న్యూయార్క్ లోని నన్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. అందులో డైమండ్ క్లాస్ సీట్లకు టికెట్ ధరను 20 వేల డాలర్లుగా నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. అంటే సుమారు రూ.16.6 లక్షలు అన్నమాట. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని తప్పుపడుతూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

ఐసీసీ తీరు క్రికెట్ కు నష్టం
‘‘ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ కేటగిరీ ఒక్కో సీటుకు 20 వేల డాలర్ల రేటు పెట్టడం చూసి షాక్ అయ్యాను.  అమెరికాలో టీ20 ప్రపంచకప్ ను నిర్వహిస్తున్నదే.. ఆటను మరింత విస్తరించడం, అభిమానులను అలరించడం కోసం. అంతే తప్ప అడ్డగోలు టికెట్ చార్జీలు పెట్టి లాభాలు ఆర్జించడం కోసం కాదు. మామూలు టికెట్ కోసం కూడా 2,750 డాలర్లు (సుమారు రూ.2.29 లక్షలు) ధర పెట్టడం దారుణం. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ (మోసగాళ్ల కౌన్సిల్)” అని లలిత్ మోదీ మండిపడ్డారు.
దీనికి సంబంధించి రూపొందించిన కొన్ని ఫొటోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 

టికెట్ రేట్లపై రాని స్పష్టత..
టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ టికెట్ల ధరలపై ఐసీసీ ఇంకా ప్రకటన చేయలేదు. లలిత్ మోదీ చేసిన అధిక ధరల ఆరోపణలపైనా ఐసీసీ ఇంకా ఎలాంటి స్పందన తెలపలేదు.
T20 World Cup
Sports News
Icc
USA

More Telugu News