Harish Rao: రైతులను కుక్కలతో పోలుస్తున్నారా?: హరీశ్ రావు

Harish Rao serious on minister comments over bonus
  • వరికి రూ.500 బోనస్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేస్తున్నారని ఆగ్రహం
  • బోనస్ విషయమై రైతులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్న హరీశ్ రావు
  • గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపు

వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారని అడిగితే కొందరు మొరుగుతున్నారంటూ వ్యవసాయ మంత్రి... రైతులను కుక్కలతో పోలుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ... వరికి రూ.500 బోనస్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి... ఇప్పుడు మాత్రం సన్నరకం వడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బాండ్ పేపర్‌పై నాడు పీసీసీ అధ్యక్షుడు, భట్టివిక్రమార్కలు సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి... సంతకాలు పెట్టారని.. అందుకే రైతులు బోనస్ అడుగుతున్నారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని విమర్శించారు.

 సన్న రకం వడ్లకు బయట ఎక్కువ ధర ఉందని... ఇక ప్రభుత్వం ఇచ్చేది ఏమిటని నిలదీశారు. ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతుంటే మొరుగుతున్నారని మాట్లాడటం వ్యవసాయ మంత్రికి తగునా? అన్నారు. అంటే మీరు రైతులను కుక్కలు అంటున్నారా? అని ధ్వజమెత్తారు. ఒక మంత్రేమో రైతుబంధు గురించి అడిగితే చెప్పుతో కొడతానంటారు... ఇప్పుడు మరో మంత్రేమో రైతులను కుక్కలతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. బోనస్ విషయమై రైతులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

ఉచిత బస్సు కూడా తుస్సు

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి మాత్రమే అమలైందని... ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తుస్సేనని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో మాట్లాడుతూ... ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీలో నిలదీస్తే తాము అలా చెప్పలేదని అవాస్తవాలు చెప్పిందన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. అందుకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News