Bangladesh MP Murder Case: బంగ్లాదేశ్ ఎంపీ హత్యకేసులో వీడని మిస్టరీ.. కనిపించని మృతదేహం.. రెండు బ్యాగులతో బయటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు   

Bangladesh MP murder mystery deepens 2 men left with big bags
  • భారత్‌లో చికిత్స కోసం వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ అల్ అజీమ్
  • 13న ఆయనతోపాటు ఇద్దరు పురుషులు, మరో స్త్రీ ఇంట్లోకి
  • ఆ తర్వాత వేర్వేరుగా ముగ్గురూ బయటకు
  • ఇద్దరు వ్యక్తుల చేతుల్లో పెద్దపెద్ద బ్యాగులు
  • అందులోనే ఎంపీ మృతదేహం ఉందని అనుమానాలు
  • దర్యాప్తు ముమ్మరం చేసిన ప్రత్యేక బృందాలు

చికిత్స కోసం ఈ నెల మొదట్లో భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ ఉల్ అజీమ్ అనర్ (56) తొలుత కనిపించకుండా పోయి ఆ తర్వాత హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ బంగ్లాదేశ్ హోంమంత్రి అసాదుజ్జమాన్ ఖాన్ విలేకరుల సమావేశంలో ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించి బంగ్లాదేశ్‌లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 

ఎంపీ అజీమ్ హత్యకు గురైనట్టు నిర్ధారించినప్పటికీ ఆయన మృతదేహం మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. కోల్‌కతాలోని ఆయన ఉన్న ఇంట్లోనే పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్, కేంద్ర ప్రభుత్వ బలగాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు అన్వర్ బసచేసిన ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించాయి. 

ఈ నెల 13న ఎంపీతోపాటు ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఇంట్లోకి వెళ్లినట్టు అందులో రికార్డయింది. ఆ తర్వాత వారు ముగ్గురు వేర్వేరుగా బయటకు వెళ్లిపోయారు. అన్వర్ జాడ మాత్రం లేదు. ముందు వెళ్లిన ఇద్దరి చేతుల్లోనూ పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నట్టు సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది తెలిపారు. 

వారు తీసుకెళ్లిన బ్యాగుల్లో ఆయన మృతదేహం ఉండే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్యలో భాగస్వాములైన మరికొందరి కోసం లుక్ అవుట్ నోటీసు జారీచేసినట్టు బంగ్లాదేశ్ హోంమంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News