RS Praveen Kumar: కాంగ్రెస్ గూండాల్లారా ఖబడ్దార్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక

BRS Leader RS Praveen Kumar Tweet
  • బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య నేపథ్యంలో ట్విట్టర్‌‌ లో వార్నింగ్
  • మంత్రి జూపల్లి అండతో దాడులకు పాల్పడితే ఊరుకోబోమని వెల్లడి
  • నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉందంటూ డీజీపీకి ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ గూండాల్లారా.. మీ దాడులకు అదరం, బెదరం. మీ మాఫియా ఆటకట్టిస్తాం.. ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులకు ప్రాణహాని ఉందంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాజకీయ హత్యల సంస్కృతికి తెరలేపిందని ఆర్ఎస్పీ ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యేనంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్ ప్రతీకార పాలన..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రతీకార పాలన చేస్తోందని ఆర్ఎస్పీ మండిపడ్డారు. మంత్రుల అండ చూసుకుని దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే తమ నాయకులపై వరుస హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులతో కొంతమంది స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ వారిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్, నాగర్ కర్నూల్ , అచ్చంపేట నియోజక వర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయాలని, ప్రాణహాని ఉన్న బీఆరెస్ సహా ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News