Nikki Haley: డొనాల్డ్ ట్రంప్‌కే నా ఓటు: నిక్కీ హేలీ

Nikki Haley said that she will vote for Donald Trump in the November election
  • ట్రంప్ విధానాల్లో పరిపూర్ణత లేకపోయినా.. బైడెన్ ఒక విపత్తు అని అభివర్ణించిన హేలీ
  • అందుకే ట్రంప్‌కు ఓటు వేస్తానని స్పష్టం చేసిన భారత సంతతి రాజకీయ నేత
  • ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారనే ఊహాగానాలకు తెరదించిన నిక్కీ హేలీ
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తానని రిపబ్లికన్ పార్టీ కీలక నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ స్పష్టం చేశారు. విధానాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపూర్ణంగా కనిపించడంలేదని, ఇదే విషయాన్ని తాను చాలాసార్లు స్పష్టంగా చెప్పానని ఆమె ప్రస్తావించారు. ట్రంప్ విధానాలు సంపూర్ణంగా లేకపోయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఒక విపత్తు అని, కాబట్టి తాను ట్రంప్‌కే ఓటు వేస్తానని హేలీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వాషింగ్టన్‌లోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో మేధావి వర్గాల చర్చలో పాల్గొని, పలు అంశాలపై హేలీ స్పష్టత నిచ్చారు.

కాగా రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చిన నిక్కీ హేలీ కొన్ని నెలల పాటు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మద్దతుదారులు ఎవరికి ఓటు వేయబోతున్నారనే ఆసక్తికర చర్చ అక్కడి రాజకీయ వర్గాల్లో నడిచింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా మద్దతు ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ బుధవారం నిక్కీ హేలీ స్పష్టత నిచ్చారు.

కాగా మార్చి నెలలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో నిక్కీ హేలీ పోటీపడ్డారు. అయితే అనూహ్యంగా వెనుకబడడంతో అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ రేసు నుంచి ఆమె విరమించుకున్నారు. ప్రచారం కూడా నిలిపివేశారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో ట్రంప్‌తో పోల్చితే వెనుకపడినప్పటికీ హేలీ గణనీయ ఓట్లను దక్కించుకున్నారు. 10 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందారు. ట్రంప్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న చాలామంది రిపబ్లికన్లు, స్వతంత్రులు హేలీకి ఓటు వేశారు. అయితే నిక్కీ హేలీ బరి నుంచి తప్పుకోవడంతో అసంతృప్త రిపబ్లికన్ల మద్దతును డెమొక్రాట్లు కోరారు.
Nikki Haley
Donald Trump
USA
US Presidential Polls
America

More Telugu News