Aarogyasri: ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆసుపత్రులు.. చర్యలు తప్పవన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో!

aarogyasri stopped in Andhra Pradesh
  • బిల్లులు చెల్లించడం లేదంటూ ముందుగా నోటీసులు ఇచ్చిన ఆసుపత్రుల నెట్ వర్క్
  • బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడి
  • నిన్న సాయంత్రం ఆసుపత్రులతో చర్చించిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్
  • నేడు మరోసారి చర్చించినా చర్చలు విఫలం
  • నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన

ముందుగా ఇచ్చిన నోటీసుల మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. పలుచోట్ల రోగులను చేర్చుకోవడానికి ఆసుపత్రులు నిరాకరించాయి. బిల్లులు చెల్లించడం లేదంటూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో... ఆసుపత్రుల యజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సీఈవో చర్చలకు ఆహ్వానించారు. అయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో ఈరోజు నుంచి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి.

రూ.203 కోట్లు విడుదల చేశాం

నిన్న చర్చల అనంతరం, నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్ల విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది. పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. కానీ మొత్తం నిధులు విడుదల చేయాలని ఆసుపత్రులు స్పష్టం చేశాయి. దీంతో ఈరోజు మరోసారి చర్చలు జరిగాయి. చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి తమ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.

అంతరాయం కలిగిస్తే చర్యలు

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్నిచోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయన్నారు. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రూ.3,556 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.203 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటి వరకు రూ.366 కోట్లు విడుదల చేశామన్నారు.  మిగతా బకాయిలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News