Feeling tired: తరచూ అలసటగా ఉంటోందా.. ఈ చిన్న మార్పులతో దూరం చేసుకోవచ్చు!

surprising things that drain your energy
  • అలసిపోయినట్టుగా ఉండటానికి పెద్ద సమస్యలేవీ ఉండకపోవచ్చన్న నిపుణులు
  • డీహైడ్రేషన్ నుంచి కూల్ డ్రింకుల దాకా సమస్యకు కారణం
  • కొన్ని మార్పులు చేసుకుంటే జోష్ వస్తుందని వెల్లడి

కొందరు ఆహారం బాగానే తీసుకున్నా, మిగతా అన్నీ బాగానే ఉన్నా.. బాగా డల్ గా ఉంటారు. ఎప్పుడూ అలిసిపోయినట్టుగా కనిపిస్తుంటారు. దానికి కారణం పెద్ద పెద్ద వ్యాధులు, అనారోగ్య సమస్యలేమీ కాకపోవచ్చు. మన నిత్య జీవన శైలిలోని కొన్ని అలవాట్లే దీనికి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చూడటానికి అవి చాలా సింపుల్ గానే కనిపించినా.. వాటి ప్రభావం ఎక్కువగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాటిని మార్చుకుంటే.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండవచ్చని చెప్తున్నారు. అవేమిటో చూద్దామా..

డీహైడ్రేషన్..
చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది. కానీ సమయానికి నీళ్లుతాగకపోతే.. శరీరంలో తగిన స్థాయిలో నీళ్లు లేకపోతే.. విపరీతంగా నిస్సత్తువ ఆవహిస్తుంది. దాహంగా అనిపించినప్పుడు తాగుతాం కదా అని అనుకోవద్దని.. డీహైడ్రేషన్ అప్పటికే మొదలై, మనం డల్ గా అవడం మొదలైన తర్వాత దాహంగా అనిపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

నోరు తెరుచుకుని నిద్రపోయినా..
కొందరు రాత్రిపూట నోరు తెరుచుకుని నిద్ర పోతుంటారు. ఇది శరీరం డీహైడ్రేషన్ అవడానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. లేదా ఏవైనా శ్వాస సమస్యలు ఉన్నాయని అర్థమని వివరిస్తున్నారు. ఇది శరీరానికి తగిన విశ్రాంతి లేకుండా చేసి.. అలసటను పెంచుతుందని అంటున్నారు. వీలైతే శ్వాస ఎక్సర్ సైజులు చేస్తే.. ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చని వివరిస్తున్నారు.

శరీరంలో ఐరన్ లోపం..
మన శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. శరీరం నిస్సత్తువగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. పైకి బాగానే కనబడినా, ఇతర ఆరోగ్య సమస్యలేవీ పెద్దగా లేకున్నా.. అలసటగా అనిపిస్తుంటే ఐరన్ లోపం అయి ఉంటుందని వివరిస్తున్నారు. తగిన ఆహారం తీసుకుంటే.. ఐరన్ శరీరానికి అంది శక్తిమంతం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

కాఫీలు, టీలు, కూల్ డ్రింకులు..
ఇక అతిగా కాఫీలు, టీలు తాగే అలవాటు.. కాసేపు శరీరాన్ని ఉత్సాహంగా ఉంచినా తర్వాత ప్రయోజనం ఉండదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా నిద్రకు ఐదారు గంటల ముందు నుంచీ.. అంటే సాయంత్రం నాలుగు, ఐదు గంటల తర్వాతి నుంచి కాఫీ, టీలు, కెఫీన్ కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అవి శరీరం పూర్తి విశ్రాంతి తీసుకోకుండా చేసి.. అలసటను పెంచుతాయని అంటున్నారు.

ఆల్కహాల్ అలవాటు..
ముందు రోజు రాత్రి తాగిన ఆల్కహాల్.. ఆ తర్వాతి రోజు కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర కాకుండా.. మగత నిద్ర పడుతుందని, శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదని అంటున్నారు. అందుకే మరునాడు పొద్దంతా తీవ్ర అలసటగా ఉంటుందని వివరిస్తున్నారు.

కదలకుండా కూర్చుండటం, ఎక్సర్ సైజ్ లేకపోవడం..

ఎక్కువ సేపు కదలకుండా కూర్చుండిపోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల.. శరీరంలో మెటబాలిజం తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది శరీరాన్ని శక్తి విహీనం చేస్తుందని.. ఏ చిన్న పని చేసినా అలసిపోతారని స్పష్టం చేస్తున్నారు. అందుకే తరచూ లేచి నడవటం, వ్యాయామం చేయడం, ఇంటి పనులు, ఇతర పనులు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News