G. Kishan Reddy: దొడ్డు వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధం... కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటి?: కిషన్ రెడ్డి

Kishan Reddy comments on rice procurement
  • కాంగ్రెస్ నేతలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శ
  • డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మొదట చెప్పి... ఇప్పుడు పంద్రాగస్ట్ అంటున్నారని మండిపాటు
  • వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పి... ఇప్పుడు సన్న వడ్లకే అంటున్నారని ఆగ్రహం

దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని... అలాంటప్పుడు వాటిని కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు.

డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి... ఆ తర్వాత పంద్రాగస్ట్ అంటున్నారని మండిపడ్డారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారని... కానీ సన్నరకం వడ్లకే అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. చాలా తక్కువమంది రైతులే సన్నరకం పండిస్తారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు, ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటోందన్నారు. రబీ సీజన్‌లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడానికి కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందన్నారు.

గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. ధాన్యం తడిసినా... కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్ యార్డుల వద్ద అన్నదాతలు పడికాపులు కాస్తున్నారన్నారు. మంగళవారం 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని... పరిస్థితి ఇలాగే ఉంటే కొనేందుకు మరో 2 నెలలు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News