Ambati Rayudu: ఐపీఎల్‌లో ధోనీ కొనసాగింపు కోసం బీసీసీఐకి అంబటి రాయుడు ఒక విజ్ఞప్తి

I do not think that was MS Dhoni last game says Ambati Rayudu
  • ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని కొనసాగించాలన్న టీమిండియా మాజీ క్రికెటర్
  • తద్వారా ధోనీ ఎక్కువ కాలం ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం ఉంటుందని వ్యాఖ్య
  • ఈ ఏడాది టైటిల్ దక్కకపోవడంతో ధోనీ వచ్చే ఏడాది తిరిగి ఆడొచ్చన్న రాయుడు
ఐపీఎల్ కెరియర్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై పలకనున్నాడా? లేదా? అని చర్చ జరుగుతున్న వేళ టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతవారం ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్‌ ధోనీకి చివరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుందని తాను భావించడంలేదని రాయుడు అన్నాడు. బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని, ఎందుకంటే ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజాలు ఎక్కువకాలంపాటు ఐపీఎల్‌లో కొనసాగేందుకు ఈ నిబంధన దోహదపడుతుందని రాయుడు అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ అనంతరం ‘స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌’లో మాట్లాడుతూ సీఎస్కే మాజీ ఆటగాడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘ ధోనీకి ఇదే చివరి మ్యాచ్‌ అని నేను అనుకోను. ధోనీ ఈ విధంగా ముగిస్తాడని నేను భావించను’’ అని వ్యాఖ్యానించాడు. తన సహజ శైలికి భిన్నంగా ఆర్సీబీ మ్యాచ్‌లో ఔట్ అయినప్పుడు ధోనీ నిరుత్సాహానికి గురయ్యాడని రాయుడు పేర్కొన్నాడు. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని, తద్వారా ఉన్నత స్థితిలో ఐపీఎల్‌కు ముగింపు పలకాలని ధోనీ భావించి ఉంటాడని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాబట్టి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఏమీ చెప్పలేమని, వచ్చే ఏడాది తిరిగి ఆడవచ్చు కూడా అని రాయుడు పేర్కొన్నాడు.

ఆర్సీబీ ఆటగాళ్లతో ధోనీ కరచాలనం చేయలేదనే విమర్శలపై రాయుడు స్పందిస్తూ.. ఆర్సీబీ ఆటగాళ్లు గెలుపు ఆనందంలో మునిగిపోయారని, దీంతో అందుబాటులో ఉన్న ఆర్సీబీ రిజర్వ్ ఆటగాళ్లు, ఆ జట్టు సహాయక సిబ్బందితో ధోనీ కరచాలనం చేసి వెళ్లిపోయాడని పేర్కొన్నాడు. 

కాగా గత శనివారం ఆర్సీబీ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఐపీఎల్ 2024 నుంచి సీఎస్కే నిష్ర్కమించింది. ఇరు జట్లకు సమానమైన పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Ambati Rayudu
MS Dhoni
IPL
IPL 2024
Cricket
Chennai Super Kings
Royal Challengers Bengaluru

More Telugu News