Congress: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో గుడ్ న్యూస్ చెబుతారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్

Mahesh Kumar says farmers will hear good news from CM
  • బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రైతులకు ఏం చేసిందని ప్రశ్న
  • రైతులకు సంకేళ్లు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని నిలదీత
  • వరివేస్తే ఉరి అన్న కేసీఆర్... తన ఫాం హౌస్‌లో వరి వేశారన్న మహేశ్ కుమార్

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెబుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ అన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. గజదొంగల్లా రైతులకు బేడీలు వేశారన్నారు. నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగిందన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని... ఈ విషయాన్ని ఎవరూ మరిచిపోలేరన్నారు.

వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. రైతులను వరి సాగు చెయ్యొద్దని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో వరి వేయలేదా? అని నిలదీశారు. గతంలో కంటే అదనంగా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు తెరిచింది తమ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్ లాగా రైతుల విషయంలో మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. బీఆర్ఎస్ నేతలు సిగ్గు, లజ్జా లేకుండా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారన్నారు.

కానీ బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నాల పేరుతో రైతులను మరోసారి మోసం చేసే పనిలో పడిందని విమర్శించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని రెండో స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోందని... లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించడం ఖాయమన్నారు. పదేళ్లు పాలన చేసిన మోదీ సెంటిమెంట్ పైనే ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News