youtuber: ముందు ‘భౌభౌ’.. చివరకు కుయ్యోమొర్రో.. ఆటపట్టిద్దామనుకున్న యూట్యూబర్ తిక్క కుదిర్చిన కుక్కపిల్ల!

YouTuber IShowSpeed Barks At Dog In South Korea Gets Bitten On The Face
  • యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కుక్క పిల్లను చూసి భౌభౌమని ఎగతాళి చేసిన వాట్కిన్స్
  • దాన్ని భయపెట్టేందుకు మొహంలో మొహం పెట్టిన వైనం
  • ఒక్కసారిగా ముక్కు కొరికిన కుక్క.. కుయ్యోమొర్రోమన్న యూట్యూబర్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. సరదా కామెంట్లు పెట్టిన నెటిజన్లు

కెనడాకు చెందిన ర్యాపర్, ఐషోస్పీడ్ పేరుతో సెన్సేషన్ సృష్టించిన స్టార్ యూట్యూబర్ డారెన్ వాట్కిన్స్ జూనియర్ కోరి కష్టాలు తెచ్చుకున్నాడు. ఓ కుక్క పిల్లను చూసి సరదాగా భౌభౌ అంటూ ఆటపట్టించబోయి చివరకు కుయ్యోమొర్రో అన్నాడు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అతని చర్య నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.

దక్షిణ కొరియా వీధుల్లో నిలబడి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న డారెన్ వాట్కిన్స్.. ఓ యువతి చేతిలోని కుక్క పిల్లను చూసి ఆటపట్టిద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా దాన్ని చూస్తూ భౌభౌమంటూ అరిచాడు. అయితే అది కామ్ గా ఉండటం నచ్చక దాన్ని రెచ్చగొడదామనుకున్నాడు. ఆ కుక్క పిల్లకు దగ్గరగా నిలబడి భౌభౌమనడం మొదలుపెట్టాడు. అప్పటికీ కుక్క సైలెంట్ గానే ఉంది. అంతటితోనైనా ఆగాడా.. అంటే అదీ లేదు. ఏకంగా దాని మొహంలో మొహం పెట్టాడు. ఇంకేం.. కుక్క పిల్లకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా అతని ముక్కు కొరికేసింది! దీంతో ముక్కుపట్టుకొని కుయ్యోమొర్రోమనడం డారెన్ వాట్కిన్స్ వంతు అయింది.

అయినా మనోడు కాసేపు ముక్కు పట్టుకొనే భౌభౌమంటూ అరిచాడు. అయితే ముక్కులోంచి రక్తం కారుతున్నట్లు గ్రహించి కంగాడు పడ్డాడు. కుక్క పిల్లకు ర్యాబీస్ ఏమైనా ఉందా అంటూ ఆరా తీశాడు. కుక్క పిల్ల తనను గాయపరిచినందుకు ఆమెపై కేసు వేస్తానని ముందు హెచ్చరించాడు. కానీ ఆ తర్వాత తప్పు తనదనని తెలుసుకొని ఊరుకున్నాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ఘొల్లున నవ్వుతూ సరదా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ అనబోతే ‘నన్ను కుక్క అంటావా’ అని కోపం వచ్చి కుక్క పిల్ల దాడి చేసిందని ఓ యూజర్ సరదా కామెంట్ పెట్టాడు. ఇంకొకరేమో ‘ఇంకా నయం.. అది పిట్ బుల్ జాతి కుక్క కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఓ యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో దానికి లక్షల్లో వ్యూస్ లభించాయి.

  • Loading...

More Telugu News