Shaine Tom Chocko: మలయాళం నుంచి దిగుతున్న స్టార్ విలన్స్!
- 'సలార్'తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
- 'దసరా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షైన్ టామ్ చాకో
- 'పుష్ప'తో మెప్పించిన ఫహద్ ఫాజిల్
- 'ఆదికేశవ'తో పరిచయమైన జోజు జార్జ్
ఒకప్పుడు మలయాళంలో స్టార్ హీరోలు చేసిన సినిమాలు మాత్రమే తెలుగులో అనువాదాలుగా వచ్చేవి. అలా ఇక్కడి ప్రేక్షకులకు మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపీ పరిచయమయ్యారు. ఆ తరువాత మలయాళం నుంచి కథానాయికలు రావడం ఎక్కువైంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఇక్కడ స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు.
మలయాళం నుంచి హీరోయిన్స్ రావడం తగ్గలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా అక్కడి సీనియర్ స్టార్స్ కి ఇటు వైపు నుంచి విలన్ రోల్స్ ఎక్కువగా వెళుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ .. ఫహాద్ ఫాసిల్ .. జోజు జార్జ్ .. షైన్ టామ్ చాకో వంటి వారు ఇక్కడి తెరపై తన హవాను కొనసాగించే దిశగా ముందుకు వెళుతున్నారు.
ఈ జాబితాలో షైన్ టామ్ చాకో ఒక అడుగు ముందే ఉన్నాడు. 'దసరా' .. 'రంగబలి' సినిమాలలో విలన్ గా మెప్పించిన ఆయన, ప్రస్తుతం బాలకృష్ణ - బాబీ సినిమాతోను, 'సలార్ 2' సినిమాతోను బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడు కొత్త ప్రాజెక్టులలోను అతని పేరు వినిపిస్తోంది. ఇక 'పుష్ప 2' సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టిన ఫహాద్ ఫాజిల్ కూడా ఆ తరువాత స్పీడ్ పెంచే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.