Sare Jahan Se Achha: అమెరికా అధ్యక్ష భవనంలో వీనుల విందుగా ’సారే జహాసే అచ్ఛా’ పాట

Sare Jahan Se Achha Hindustan Hamara Played At White House
  • ఆసియా అమెరికన్ల సలహా సంఘం కార్యక్రమంలో ఆలపించిన మెరైన్ బ్యాండ్
  • అతిథులకు పానీపూరీ అందించిన వైట్ హౌస్ సిబ్బంది
  • బ్యాండ్ వాయించి ఆకట్టుకున్న డాక్టర్ వివేక్ మూర్తి
విదేశాలలో మన దేశానికి చెందిన పాటలు వినిపిస్తే ఆ ఆనందమే వేరు.. అలాంటిది ఏకంగా అగ్రరాజ్యం అమెరికా అధికారిక భవనంలో ‘సారే జహాసే అచ్ఛా..’ అంటూ బ్యాండ్ వినిపిస్తే ఆ జోష్ మామూలుగా ఉండదు. సోమవారం అమెరికా అధ్యక్ష భవనంలో ఓ విందుకు హాజరైన భారత సంతతి అతిథులకు ఈ అనుభవమే ఎదురైంది. వైట్ హౌస్ అఫీషియల్ బ్యాండ్ సారే జహాసే అచ్ఛా వాయించడంతో వారంతా ఎంకరేజ్ చేశారు. యూఎస్‌ సర్జన్‌ జనరల్ డాక్టర్‌ వివేక్‌మూర్తి ఉత్సాహంగా డ్రమ్స్‌ వాయించారు. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు భారతీయ వంటకం సమోసాతో పాటు పానీపూరీలతో విందు ఇచ్చారు. అతిథులను ఉద్దేశించి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. వందల ఏళ్ల క్రితం ఆసియా నుంచి వలస వచ్చిన వారిని స్థానిక హవాయియన్లు ఆదరించారని పేర్కొన్నారు. తమ భూములు ఇచ్చి వారిని తమలో కలిపేసుకున్నారని చెప్పారు. అలా ఇరువర్గాల వారసత్వం దేశ చరిత్రలో భాగమైందని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్ అజయ్ జైన్ భూటోరియా ట్విట్టర్ లో షేర్ చేశారు.

Sare Jahan Se Achha
White House
America
Golgappa
IndoAmericans

More Telugu News