NASA: చంద్రుడిపై రైళ్లు.. నాసా ప్రణాళికలు రెడీ

NASA is venturing to establish the first fully operational railway station on the Moon

  • రైల్వే స్టేషన్‌ నిర్మించాలని యోచన
  • ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ (ఫ్లోట్)’ అనే ప్రత్యేక వ్యవస్థను ప్రతిపాదించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ
  • ట్రాకులపై తేలియాడుతూ ప్రయాణించనున్న రైళ్లు

చంద్రుడి ఉపరితలం అంతటా సమర్థవంతగా, నమ్మకంగా పేలోడ్‌ను సులభంగా రవాణా చేయడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని యోచిస్తోంది. జాబిల్లిపై అన్వేషణలను మరింత విస్తరించడం, అక్కడి ఉపరితలంపై క్రియాశీలక స్థావరాలను ఏర్పాటు చేయడం నాసా ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. 

రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ (ఫ్లోట్)’ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది. ఇందుకోసం ‘మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ’ని పరిచయం చేసింది. ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్ స్ట్రక్చర్‌పై ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఫ్లోట్ రోబో‌లు ట్రాకులపై అన్‌పవర్డ్ మాగ్నెటిక్ లెవిటేషన్‌ను ఉపయోగించి తేలియాడే రవాణాకు మార్గం సుగుమం చేస్తాయి. తద్వారా సంప్రదాయక రైళ్ల మాదిరిగా కాకుండా చంద్రుడిపై ట్రైన్స్ తేలియాడుతూ ప్రయాణిస్తాయి. 

సంప్రదాయ రైళ్ల వ్యవస్థలో సాధారణంగా తలెత్తే చక్రాలు, ట్రాకుల సవాళ్లను అధిగమించడంలో ‘మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ’ ఉపయోగపడనుంది. ట్రాక్‌పై చంద్రుడి దుమ్ము ధూళి రాపిడిని తగ్గించడానికి ఫ్లోట్ రోబో‌లను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేస్తారు. ట్రాక్‌ను రైలు తాకకుండా ఈ రోబో‌లు నిరోధిస్తాయి. తద్వారా రైలు సజావుగా తేలుతూ ప్రయాణిస్తుంది. 

ప్రతిపాదిత ఫ్లోట్ వ్యవస్థ సెకన్‌కు 0.5 మీటర్ల వేగంతో వివిధ ఆకృతుల పేలోడ్‌లను రవాణా చేయగలదని నాసా పేర్కొంది. ఒక భారీ స్థాయి ఫ్లోట్ వ్యవస్థ రోజుకు 100,000 కిలోల పేలోడ్‌ను చాలా కిలోమీటర్లకు పైగా దూరం తరలించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. చంద్రుడిపై స్థావర కార్యకలాపాలను సులభతరం చేస్తుందని అంచనా వేసింది. చంద్రుడిపై ఈ నూతన రవాణా పరిష్కారం భూమికి వెలుపల మానవ అన్వేషణ, ఆవాసాల అభివృద్ధిలో గణనీయమైన ముందడుగు అని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News