Allu Arjun: వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లిన అల్లు అర్జున్.. పోటెత్తిన అభిమానులు 

Allu Arjun in Nandyal in support of his friend and YSRCP candidate Shilpa Ravichandra Reddy
  • నంద్యాల నుంచి వైసీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రా రెడ్డి
  • రవిచంద్రారెడ్డితో బన్నీకి ఎప్పటి నుంచో మంచి అనుబంధం
  • గత ఎన్నికల్లో కూడా రవికి మద్దతుగా ఉన్న బన్నీ
ఏపీలో ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటి వరకు హోరెత్తించిన మైకులు సాయంత్రం 5 గంటలకు మూగబోనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న వారు అందరూ సాయంత్రానికి తమ ప్రచారాన్ని ముగించనున్నారు. మరోవైపు తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. ఇదే సమయంలో తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు చేరుకున్నారు. 

అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వెళ్లారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. మెగా హీరోలంతా పవన్ వెనుకే ఉన్నారు. అయితే, శిల్పా రవిచంద్రారెడ్డితో ఎప్పటి నుంచో బన్నీకి మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. ఇంకోవైపు స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ క్లాస్ మేట్స్ కూడా. మరోవైపు బన్నీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని అభిమానులకు బన్నీ చూపించారు. రవిచంద్రారెడ్డికి ఓటు వేయాలని కోరారు.  

2019 ఎన్నికల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. రవిని ప్రజాసేవలో చూడటం తనకు ఎంతో గర్వంగా ఉందని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ... స్నేహానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాలకు వెళ్లడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Allu Arjun
Tollywood
Shilpa Ravichandra Reddy
YSRCP
Nandyal

More Telugu News