beggar: గుండెపోటుతో కన్నుమూసిన హైటెక్ బెగ్గర్!

first digital beggar in india no more
  • మెడలో క్యూఆర్ కోడ్ స్కానర్లు ధరించి అందరినీ ఆకర్షించిన రాజు బికారీ
  • బిహార్ లోని బెట్టియా రైల్వే స్టేషన్ లో డిజిటల్ పద్ధతుల్లో యాచిస్తూ ఖ్యాతి
  • అనారోగ్యం బారిన పడటం.. ఆపై గుండెపోటు రావడంతో మృతి

దేశంలోనే తొలి డిజిటల్‌ బెగ్గర్‌ గా నెట్టింట ఖ్యాతిగాంచిన రాజు బికారీ అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. దీంతో ఇప్పటివరకు ఆయన గురించి తెలియని వారంతా ఎవరాయన అంటూ నెట్ లో వెతకడం మొదలుపెట్టారు.

సాధారణంగా యాచకులు ఎలా యాచిస్తారు? గుడి మెట్ల మీదనో లేదా రోడ్లపైనో చిల్లర అడుగుతుంటారు. కానీ బిహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్‌లో యాచించే రాజు బికారీ స్టైలే వేరు. హైటెక్ బెగ్గర్ గా పేరుతెచ్చుకున్నాడు. దేశంలోనే తొలి డిజిటల్ యాచకుడిగా ప్రత్యేకత సంపాదించుకున్నాడు. 

ఎప్పుడూ మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్‌ కోడ్‌ల ట్యాగ్‌లను వేలాడదీసుకొని స్టేషన్ లోని ప్రయాణికులను డబ్బు యాచించేవాడు. దీంతో అతన్ని చూసి ఆశ్చర్యపోయే ప్రజలంతా అతని మెడలోని క్యూఆర్ కోడ్ స్కానర్లను స్కాన్ చేసి నచ్చినంత డబ్బు ఇచ్చేవారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితోనే తాను ఈ కొత్త అవతారం ఎత్తానని పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు.

డిజిటల్‌ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు బికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్‌ కి బాత్‌’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్‌ క్యాంటీన్‌ నుంచే రోజుకు రెండు పూటలా ఆహారం దొరికేది.

కొంతకాలంగా రాజు మతిస్థిమితం సరిగ్గా లేనట్లుగా ప్రవర్తిస్తుండేవాడు. దీనికితోడు ఇటీవల అతని ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఈ క్రమంలో తాజాగా బెట్టియా రైల్వే స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌లు చూపిస్తూ యాచిస్తుండగానే గుండెపోటు రావడంతో మృతిచెందాడు. అతని మరణవార్త అన్ని హిందీ వెబ్ సైట్లలో ప్రముఖంగా కనిపించింది. యూట్యూబ్ లోనూ పలువురు నెటిజన్లు రాజు బికారీ ఇకలేడంటూ తమ ఆవేదనను పంచుకున్నారు.

  • Loading...

More Telugu News