NRI Remittances: భారత్‌కు ఎన్నారై నిధుల వెల్లువ.. సరికొత్త రికార్డు!

India Leads Global Inbound Remittances crossing 100 billion dollar mark for the first time
  • 2022లో 111.1 బిలియన్ డాలర్లను స్వదేశానికి పంపిన ఎన్నారైలు
  • రెమిటెన్సుల్లో 100 బిలియన్ మార్కు దాటిన తొలి దేశంగా భారత్ రికార్డు
  • భారత్ తరువాతి స్థానంలో నిలిచిన మెక్సికో
  • చైనీయుల నుంచి స్వదేశానికి తగ్గిన నిధుల రాకడ
ఉద్యోగవ్యాపారాల రీత్యా వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు స్వదేశానికి నిధుల వరద పారించారు. ప్రపంచ బ్యాంకు, వలసలపై వరల్డ్ మైగ్రేషన్ 2024 నివేదికల ప్రకారం 2022లో భారత్‌కు ఎన్నారై నిధులు వెల్లువెత్తాయి. రెమిటెన్స్‌ల్లో 100 బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. 61.1 బిలియన్ డాలర్ల నిధులతో మెక్సికో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ వరుసగా 4, 10వ స్థానాల్లో నిలిచాయి. అయితే, ఈ దేశాలకు చేరిన నిధుల్లో అధికభాగం శాలరీల రూపంలో స్విట్జర్‌ల్యాండ్ నుంచి వచ్చినట్టు తేలింది. 

వరల్డ్ బ్యాంక్ డాటా ప్రకారం 2015లో భారత్‌కు 68.9 బిలియన్ డాలర్ల ఎన్నారై నిధులు అందాయి. 2022 నాటికల్లా ఇవి 111.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2015లో చైనీయులు పంపిన 33.1 బిలియన్ డాలర్ల నిధులతో రెండో స్థానంలో నిలిచిన చైనా ఈసారి ఏడో స్థానానికి పరిమితమైంది. ఈమారు చైనీయులు స్వదేశానికి కేవలం 26.1 బిలియన్ డాలర్ల నిధులను పంపారు. ఈ జాబితాలో భారత్, మెక్సికో తరువాతి స్థానాల్లో వరుసగా ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, పాకిస్థాన్, ఇంగ్లండ్, చైనా, బంగ్లాదేశ్ నిలిచాయి. అయితే, అనధికార మార్గాల్లో పౌరులు తమ దేశానికి పంపిన నిధులను ఈ లెక్కింపులో పరిగణలోకి తీసుకోలేదని వరల్డ్ ఇమిగ్రేషన్ రిపోర్టు పేర్కొంది. 

తాజా లెక్కల ప్రకారం, అమెరికాలో అత్యధికంగా 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. యూఏఈలో 31 లక్షల మంది ఉంటున్నారు. ఆ తరువాతి స్థానాల్లో మలేషియా (29.9 లక్షల భారతీయులు), సౌదీ అరేబియా (28.02 లక్షలు), మయాన్మార్ (20.8 లక్షలు), బ్రిటన్ (18.30 లక్షలు), శ్రీలంక (16.1 లక్షలు), దక్షిణాఫ్రికా (15.6 లక్షలు), ఆస్ట్రేలియా (7 లక్షలు) ఉన్నాయి.
NRI Remittances
World Bank
World Migration Report
India

More Telugu News