ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూమి, మీ ఇల్లు మీది కాదు :నారా లోకేశ్
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం రాకతో భూ సంబంధిత ఫిర్యాదులు పెరిగాయన్న లోకేశ్
- అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ
- కూటమిని అధికారంలోకి తీసుకురావాలని లోకేశ్ పిలుపు
ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా మీ భూములకు సంబంధించిన దస్తావేజులు చేతికివ్వరని, అధికారం, డబ్బు,కండబలం ఉంటే ఎటువంటి భూమినైనా రాజకీయనేతలు కొట్టేసే అవకాశముందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన కాగితాల్లేవని యజమానులనే జైల్లో పెట్టే అవకాశముందని తెలిపారు. భూ హక్కులపై వారసత్వాన్ని అధికారులు మాత్రమే నిర్ణయించగలుగుతారని లోకేశ్ వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా జగన్ మోహన్ రెడ్డి మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టే అవకాశముందని, మీకు అన్యాయం జరిగిందని కోర్టులకూ కూడా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
మరోవైపు కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా హామీ నిచ్చారు. స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుందని తెలిపారు. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ, ఆ తరాల మధ్య ప్రేమలను సీఎం జగన్ పట్టించుకోడని అందుకే ఆయన చెల్లెలు షర్మిలను కూడా దూరం పెట్టాడని చంద్రబాబు తూర్పారబెట్టారు.