Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటిముఖం పట్టించాలి: చంద్రబాబు

  • జగన్ సర్కార్ ప్రజల జీవితాలతో చెలగాటమాడిందన్న బాబు
  • ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స తాకట్టు పెట్టారని మండిపాటు
  • జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని వెల్లడి
Chandrababu Naidu Election campaign in Cheepurupalli

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మట్టికరవబోతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో వైఎస్సార్ పార్టీ చెలగాటమాడిందని ఆరోపించారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వైసీపీ సర్కార్ ను ఇంటిముఖం పట్టించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖపట్టణం ఇన్ చార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖ ప్రజలను దోచుకుతింటుంటే ఇదే నియోజకవర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ కిక్కురుమనకుండా ఉన్నారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర తెలుగు దేశం పార్టీకి కంచుకోటని, ఉత్తరాంధ్ర ప్రజలెప్పుడూ టీడీపీ వైపే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక్కడి పదవులన్నీ బొత్స సత్యనారాయణ కుటుంబానివేనని, ఉత్తరాంధ్రలో పదవులు నిర్వహించేందుకు వెనుకబడిన వర్గాల్లో సమర్థులెవరూ లేరా అని ప్రశ్నించారు.  బొత్స సత్యనారాయణలాంటి స్థాయి వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని అవినీతిపరుడని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే మోదీ అవినీతిపరుడని మాట్లాడాలని చంద్రబాబు సవాల్ చేశారు. తెలుగు దేశం పార్టీ వంద సంక్షేమ పథకాలిచ్చిందని తెలిపారు.  జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలేమీ పెరగలేదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రోడ్లు వేయలేదని, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు చెప్పారు. ఈ ఐదేళ్ల కాలంలో తొమ్మిదిసార్లు కరెంట్ చార్జీలు పెంచారని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం క్వార్టర్ బాటిల్ 60 రూపాయలైతే జగన్ పాలనలో అది 200రూపాయలకు పెరిగిందని విమర్శించారు. జగన్ పాలనలో బాదుడే బాదుడు కార్యక్రమంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, పేదలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News