YS Jagan: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే: సీఎం జగన్ తీవ్ర విమర్శలు

Believing Chandrababu is like putting a head in the mouth of a python sasy AP CM YS Jagan

  • టీడీపీ అధినేత గత చరిత్ర ఇదేనని విమర్శించిన వైసీపీ అధినేత
  • 2014లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారని విమర్శలు
  • ప్రధానమంత్రితో సభలు నిర్వహించి కనీసం ప్రత్యేక హోదా ప్రకటన కూడా చేయలేకపోయారని మండిపాటు

చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదేనని, అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థమని, మోసపోవద్దని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 ప్రచారంలో భాగంగా రాజంపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

విమర్శించిన నోటితోనే పొగిడిపోయారు.. ప్రధానిపై జగన్ విమర్శలు
ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నారని, ఏమైనా ప్రకటన చేస్తారేమోనని ప్రజలు ఎదురుచూశారని, కానీ ప్రత్యేక హోదా ప్రకటన కూడా చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు. పెత్తందారుల సభలతో ప్రజలకు నిరాశే మిగిలిందని, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.  ‘‘చంద్రబాబుకు ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకు ఏం కావాలి, దుష్టచతుష్టయానికి ఏం కావాలి. అన్నీ వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడారు. మన మీద నాలుగు రాళ్లు వేశారు. మొన్నటి దాకా చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలో ఎవరూ ఉండరన్న మోదీ... ఇప్పుడు వాళ్ల కూటమిలో చేరారు, అదే నోటితో పొగిడారు’’ అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎందుకు పిలుస్తున్నారు?
‘‘ఎన్డీయే ఏపీ అజెండాతో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం జరిగింది? ఇదే నాయకులు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. కూటమి, డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ మాటలు చెబుతున్నారు. మరి 2014లో ప్రకటించిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎందుకు పిలుస్తున్నారు’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరోవైపు ఐదేళ్లక్రితం ఇచ్చిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేసిన తాను ఉన్నానని, ఇంటింటికీ పథకాలు ఇచ్చి తాను ఆశీర్వాదం కోరుతున్నానని అన్నారు. 

సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అన్ని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, ప్రతి ఇల్లూ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు అని జగన్ అన్నారు. ఏపీ ప్రజలందరూ మళ్లీ మోసపోతారని అన్నారు.

  • Loading...

More Telugu News