Maldives: రేపు భారత్ పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్

Maldivian foreign minister Moosa Zameer will visit India on May 9
  • కొన్నాళ్లుగా భారత్, మాల్దీవుల మధ్య దెబ్బతిన్న సంబంధాలు
  • ఇటీవల మాల్దీవుల వైఖరిలో మార్పు
  • భారత పర్యాటకులు తమ దేశానికి రావాలన్న మాల్దీవుల ప్రభుత్వం
  • రేపు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో మూసా జమీర్ భేటీ
కొంతకాలంగా భారత్ తో మాల్దీవుల సంబంధాలు ఏమంత సజావుగా లేవన్నది వాస్తవం. లక్షద్వీప్ పర్యాటకం అంశంతో ఆ విభేదాలు మరింత ప్రస్పుటమయ్యాయి. అయితే, ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీఎన్సీ పార్టీ మరోసారి విజయం సాధించాక పరిస్థితిలో కొంత సానుకూల మార్పు కనిపిస్తోంది. 

భారత పర్యాటకులు తమ దేశానికి రావాలంటూ మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఫైజల్ కూడా కొన్ని రోజుల కిందట ఓ ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు. తాజాగా, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు (మే 9) భారత్ పర్యటనకు రానున్నారు. మహ్మద్ ముయిజ్జు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఓ మాల్దీవుల మంత్రి భారత్ లో ఉన్నతస్థాయి పర్యటనకు రావడం ఇదే ప్రథమం. 

మాల్దీవుల మంత్రి మూసా జమీర్ గురువారం నాడు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో భేటీ కానున్నారు. ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరగనున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ముందడుగు వంటిదని భావిస్తున్నామని పేర్కొంది. 

మాల్దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని మహ్మద్ ముయిజ్జు ఆదేశించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఎడం పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యంలో చాలా భాగం వెనక్కి వచ్చేయగా, తమ దేశం నుంచి మే 10 లోపు భారత బలగాలు  పూర్తిగా వెళ్లిపోవాలంటూ ముయిజ్జు ఇటీవలే డెడ్ లైన్ విధించారు.
Maldives
Moosa Zameer
India
S.Jaishankar
New Delhi

More Telugu News