Pawan Kalyan: జగన్ కు ప్రజలు ఒక్క చాన్స్ ఇవ్వడం మంచిదైంది: రేపల్లెలో పవన్ కల్యాణ్

Pawan Kalyan take jibe at Jagan
  • బాపట్ల జిల్లా రేపల్లెలో వారాహి విజయభేరి సభ
  • జనసేన కార్యకర్తల వల్లే తాను ఇన్నేళ్లు నిలబడగలిగానని పవన్ వెల్లడి
  • అడ్డగోలుగా దోచుకోవడం కుదరదు... ఇక్కడ పవన్ ఉన్నాడంటూ ఫైర్
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జగన్ కు లాభం కనిపించిందని విమర్శలు
బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తాను అనేక సవాళ్లు ఎదుర్కొని టీడీపీకి అండగా నిలబడగలిగానంటే అందుకు కారణం జనసైనికులు, వీరమహిళలేనని అన్నారు. తాను ఓడిపోయినప్పటికీ బలంగా నిలబడలిగానంటే అందుకు కారణం జనసేన పార్టీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. 

ఎన్నో ఉలి దెబ్బలు తట్టుకున్న శిల అందమైన విగ్రహంలా మారుతుందని, ఈ దశాబ్ద కాలంలో ఎదుర్కొన్న ఎదురుదెబ్బలతో జనసేన పార్టీకి కూడా ఒక అందమైన రూపు వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. 

ఇక, రాష్ట్రంలో 18 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నప్పటికీ మెగా డీఎస్సీ ఇవ్వలేదని, పోలీసు ఉద్యోగాల ఖాళీలను కూడా భర్తీ చేయలేదని పవన్ ఆరోపించారు. మూతపడిన స్కూళ్లను తిరిగి తెరిపించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు రాక ఎంతో మంది వేదనకు గురవుతున్నారని, ఆ రోజున వైసీపీకి ఓటేయకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. 

"అయితే, వైసీపీ అధికారంలోకి రావడం మంచిదే అయింది... ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తండ్రి లేని బిడ్డ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేయగలడో అందరికీ అర్థమైంది. నేను, చంద్రబాబు మాట్లాడుకున్నాం... అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నాం. 

ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. అందుకు బలమైన, సుస్థిర రాజకీయ వాతావరణం ఉండాలి. నేతలు రోజూ కొట్టుకుంటుంటే రాష్ట్రానికి ఎవరొస్తారు?

నేను బతికుండగా ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజల ఐక్యతకు, భారతదేశ సమగ్రతకు అన్యాయం జరగనివ్వను, భంగం కలగనివ్వను. మడ అడవులను కొట్టేస్తున్నా ఎవరం ఏమీ చేయలేకపోతున్నాం... యంత్రాంగం ఏం చేస్తోంది? ఎంత మట్టి తింటారు? ఎవరైనా సరే భూమికి బాకీ ఉంటాడు అని తెలంగాణలో ఒక సామెత చెబుతారు. మట్టిని తినేవాళ్లకు చెబుతున్నా... వైసీపీ వాడైనా సరే... మీరు చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే.... ఎక్కడికీ వెళ్లలేరు మీరు. 

అడ్డగోలుగా దోచేస్తామంటే చూస్తూ ఊరుకోం. మాలాంటి వాళ్లం ఇంకా బ్రతికే ఉన్నాం... పవన్ కల్యాణ్, జనసైనికులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మేమందరం బతికే ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ దేశం కోసం చచ్చిపోయేవాళ్లం ఇంకా బతికే ఉన్నాం.

వైఎస్ జగన్, వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి... కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటాడు... దోపిడీ చేసేవాడుంటే ఆ దోపిడీని నిలువరించే వాడు ఉంటాడు... అడ్డగోలుగా మీరు దాడులు చేస్తుంటే తిరగబడేవాడు ఉంటాడు... కాలం అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది. 

జగన్ ఒక్క చాన్స్ అంటే ప్రజలు ఇచ్చారు. కానీ జగన్ ఏం చేశాడు...? సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కాలువల్లో పూడికలు తీయలేదు, మెగా డీఎస్సీ ఇవ్వలేదు, ఉన్న స్కూళ్లు తీసేయించాడు, అమ్మఒడి కింద ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ అని చెప్పి ఒకరికి మించి ఇవ్వడంలేదు. 

అందుకే మా కూటమి మేనిఫెస్టో చూడండి. మేం బాధ్యత తీసుకుంటాం... జవాబుదారీ వహిస్తాం. దివ్యాంగులకు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు... మేం వస్తే వారికి రూ.6 వేలు ఇస్తాం. వృద్ధాప్య పెన్షన్లు రూ.4 వేలు ఇస్తాం. మహిళలకు చేదోడుగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రైతన్నకు అండగా ఏడాదికి రూ.20 వేలు అందిస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాలి... వీళ్లు భూమ్మీద పిడికెడు గింజలు చల్లి పైరును పండించే వాళ్లు కాదు, ఒక గింజ నాటి చెట్లు పెంచేవాళ్లు కాదు. ఈ చట్టం మీకు మంచి చేస్తుందని జగన్ ఈ మధ్యన చెబుతున్నాడు. 

జగన్ ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్న వ్యక్తి. ఒక్క విశాఖపట్నంలోనే రూ.25 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టాడు. నిన్ను ఎలా నమ్ముతాం జగన్? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా పంపించిందంతే... ఇది పనిచేస్తుందా, మంచి చెడు ఏమిటి అనేది తెలుసుకోవాలని తప్ప అమలు చేయాలని కేంద్రం చెప్పలేదు.

ఒక వేళ  కేంద్రం ప్రభుత్వం అమలు చేయమని చెప్పినా... మనం మాట్లాడుకుని, రాష్ట్ర ప్రజల్ని అడిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు నచ్చకపోతే అదేమాట కేంద్రానికి చెబుతాం. ప్రజలకు నచ్చలేదు, అందుకే మేం దీన్ని తిరస్కరిస్తున్నామని చెబుతాం. 

కానీ జగన్ కు ఈ చట్టంలో లాభదాయకంగా కనిపించింది. ఏ హక్కులు లేకుండానే మన ఇళ్లలోకి వచ్చి ఆస్తులు లాగేసుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మనం ఒప్పుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టవుతుంది" అంటూ పవన్ ప్రసంగించారు.
Pawan Kalyan
Repalle
Varahi Vijayabheri
Janasena
TDP-JanaSena-BJP Alliance
Jagan
YSRCP

More Telugu News