BJP: బండి సంజయ్ ఇప్పుడు వచ్చి రాముడి ఫొటోతో ఓట్లు అడుగుతున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్

  • ఆరు గ్యారెంటీలు ఇచ్చి వాటిని అమలు చేస్తున్నామన్న పొన్నం ప్రభాకర్
  • ఖాతాలో రూ.15 లక్షలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీని బీజేపీ నెరవేర్చిందా? అని ప్రశ్న
  • తెలంగాణకు విభజన హామీలు కూడా అమలు చేయడం లేదని విమర్శ
Minister Ponnam Prabhakar fires at Bandi Sanjay

కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై ఇన్నాళ్లు తన నియోజకవర్గంలో తిరగలేదని, ఎక్కడా అభివృద్ధి చేయలేదని ఇప్పుడు వచ్చి అక్షితలు పంచి రాముడి ఫొటో పెట్టి ఓట్లు అడుగుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం మంత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుండ మండలం నాగంపేట గ్రామంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చిందని, వాటిని అమలు చేస్తున్నామన్నారు. తాము అమలు చేస్తున్నప్పటికీ ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని అడుగుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి రాకముందు నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిందని... మరి ఆ డబ్బులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారని, రైతులకు పెన్షన్ ఇస్తానని చెప్పారని... కానీ అవేమీ నెరవేరలేదన్నారు. తెలంగాణకు విభజన హామీలు కూడా అమలు చేయలేదన్నారు. పైగా నల్లచట్టాలు తెచ్చి అందర్నీ ఇబ్బంది పెట్టారన్నారు. మరి బీజేపీ వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? అని నిలదీశారు.

మనమంతా హిందువులం కాదా? కానీ వారు రాముడి ఫొటోతో ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు బీజేపీ అధికారంలో ఉందని... బండి సంజయ్ అయిదేళ్లు ఎంపీగా ఉన్నాడని... కరీంనగర్‌కు ఏం చేశాడని నిలదీశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు జమ్మికుంట మండలానికి మోడల్ స్కూల్, కస్తుర్బా స్కూల్, రైల్వే స్టేషన్, ఫైర్ స్టేషన్ తెచ్చానని గుర్తు చేశారు. తిరుపతికి రైలు కూడా తీసుకువచ్చానన్నారు. ఇలాంటి అభివృద్ధి మళ్లీ జరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News