Nandamuri Balakrishna: మా నాన్నని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించండి: నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని

  • ఎమ్మెల్యేగా హిందూపూర్‌లో చాలా సేవా కార్యక్రమాలు చేశారన్న తేజస్విని
  • చంద్రబాబును సీఎం చేయడం అందరి బాధ్యత అని అభ్యర్థన
  • సంక్షేమం ఒక్కటే అందిస్తే జనాలు పైకి రాలేరని వ్యాఖ్య
Make my father MLA again Nandamuri Balakrishna daughter Tejaswini urges voters in Hindupur

ఎన్నికల సమయం వచ్చిందని, తమ భవిష్యత్ గురించి ఆలోచించుకొని ఓటర్లు ఓటు వేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఓటర్లను అభ్యర్థించారు. ఓటు వేయడానికి ముందు ఆలోచన చేయాలని ఆమె సూచించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ అని ఆమె అన్నారు. సంక్షేమం లేదా అభివృద్ధి ఈ రెండింట్లో ఒక్కదాన్నే చేస్తే జీవితంలో ఎప్పటికీ పైకి రాలేమని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలు ఉంటే ఈ రోజు బావుంటుందని, భవిష్యత్‌లో కారు కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా ఎలా చేస్తారంటూ ఓటర్లను ఆమె ప్రశ్నించారు. అభివృద్ధి చాలా ముఖ్యమని, అభివృద్ధి, సంక్షేమాన్ని ఒకేసారి అందించగల నాయకుడు నారా చంద్రబాబు అని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయడం అందరి బాధ్యత అని కోరారు. 

ఇక హిందూపురం ప్రస్తుత ఎమ్మెల్యే, మళ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నందమూరి బాలకృష్ణను మరోసారి గెలిపించాలని తేజస్విని కోరారు. బాలకృష్ణ ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చి పనిచేశారని, అన్నా క్యాంటిన్లు పెట్టారని గుర్తుచేశారు. స్థానికంగా రోడ్లు కూడా వేశారని అన్నారు. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారని ఆమె అన్నారు. అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేస్తారని ఆశిస్తున్నానని ఆమె చెప్పారు.

‘‘నాన్న గారు 2014లో తొలిసారి పోటీ చేసినప్పుడు మొదటిసారి హిందూపూర్‌కు వచ్చాను. ఆ తర్వాత 2019లో వద్దామనుకున్నాను. కానీ నా భర్త భరత్ పోటీ చేయడంతో అప్పుడు రాలేకపోయాను. మళ్లీ ఈసారి 2024లో నా భర్త భరత్ పోటీ చేస్తున్నప్పటికీ రెండు రోజులు బ్రేక్ తీసుకొని.. ఇక్కడి వారిని ఎలాగైనా చూడాలని వచ్చాను. అప్పటికీ ఇప్పటికీ మీ ప్రేమ అదేవిధంగా ఉంది. ప్రేమ అప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ఉంది. అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ మేరకు హిందూపురం నియోజకవర్గంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘స్త్రీ శక్తి’ సమావేశంలో ఓటర్లను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణితో పాటు బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర కూడా పాల్గొన్నారు.

More Telugu News