delhi: రోడ్డుకు అడ్డంగా టూవీలర్ పెట్టి.. కుర్చీలో కూర్చొని పోజు కొట్టాడు!

  • ట్రెండింగ్ రీల్ కోసం ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ యువకుడి పిచ్చి పని
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
  • మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు
man sits on chair with parked bike in the middle of road in delhi for reel

సోషల్ మీడియాలో పాప్యులర్ అయ్యేందుకు కొందరు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భారీగా వ్యూయర్లు లేదా సబ్స్క్రైబర్లను పొందేందుకు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సైతం ఇలానే రీల్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు.

తన సోషల్ మీడియాలో రీల్ కోసం విపిన్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని జీటీ కర్నాల్ రోడ్డుపై బండిని అడ్డంగా పార్క్ చేశాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై ఏకంగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. నల్ల కళ్లద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని పోజు కొట్టాడు. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే ఈ వీడియోను చూసిన ఢిల్లీ పోలీసులు అతని తిక్క కుదిర్చారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు వెంటనే అతన్ని అరెస్టు చేశారు. 

‘మోటారు వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లను కూడా వర్తింపజేశాం. అతన్ని అరెస్టు చేయడంతోపాటు బైక్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నాం. అతని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది’ అని ఢిల్లీ పోలీసులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఇటీవల ఓ జంట సూపర్ హీరో దుస్తుల్లో రోడ్డుపై వీడియో షూటింగ్ చేశారు. దీంతో పోలీసులు వారికి జరిమానా విధించడంతోపాటు అరెస్టు చేశారు. అదే తరహాలో తాజాగా నడిరోడ్డుపై రీల్స్ చేసిన యువకుడిని అరెస్టు చేసి ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని గట్టి సందేశం ఇచ్చారు.

యువకుడి రీల్స్ పిచ్చిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. అతనికి రూ. లక్షల్లో ఫైన్ కూడా వేయాల్సిందని ఒకరు అభిప్రాయపడ్డారు. మరొకరేమో పోలీసులను అభినందిస్తూ పోస్టు పెట్టారు. రీల్స్ కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ప్రమాదకరమని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం స్టాండర్డ్ ప్రాక్టీస్ గా మారాలని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

More Telugu News